జిల్లా లో క్ సభ ఎన్నికల మోడల్ కోడ్ అమలు

జిల్లా లో క్ సభ ఎన్నికల మోడల్ కోడ్ అమలు
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  భారత ఎన్నికల కమీషన్ లోకసభ ఎన్నికల నిర్వహణకు అనౌన్స్ మెంట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో మోడల్ కోడ్ అమలులోకి వచ్చినదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో  రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లో క్ సభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమీషన్ ప్రకటించిన దరిమిలా రాజకీయ పార్టీలు వారి ప్రచారం నిర్వహణలో భాగంగా ప్రచార  వాహన, మైకు, ఇతరత్రా అనుమతి లకు సింగిల్ విండో పద్దతీలో సువిధ  ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా కర పత్రాలు, ఫ్లెక్సీ లు, ఇతర ప్రచార సామాగ్రిల అనుమతులకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7,09,311 మంది ఓటర్లు ఉన్నారని,  ఇందులో 3,40,627 మంది పురుషులు, 3,68,650 మంది స్త్రీలు, 34 మంది థర్డ్ జెండర్, దివ్యంగులు 31,954 మంది ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 785 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో పట్టణ ప్రాంతాలలో 201, గ్రామీణ ప్రాంతాల్లో 584 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. కలెక్టరేట్ లో జిల్లా కంట్రోల్ రూం నిరంతరంగా పనిచేస్తుందని తెలిపారు. అత్యవసర, ఇతర సేవలకు 1800 425 7620 కంట్రోల్ రూం నెంబర్ కు, 1959 హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. మాడల్ కోడ్ అమలుకు 18 ఫ్లయింగ్ స్వాడ్, 18 స్టాటిస్టిక్ సర్వెల్లేన్స్ టీమ్ లు, 18 మాడల్ కోడ్ అధికారులు, 6 వీడియో వీవింగ్ టీమ్ లు, 91 సెక్టరల్ అధికారులను నియమించామని, 7 అంతర్ జిల్లా చెక్ పోస్టు లను ఏర్పాటు చేయడం జరిగిందని  తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించెందుకు రాజకీయ పార్టీల ప్రతినిదులు సహకరించాలని కోరారు.

ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు వారి ప్రచారం కోసం అవసరమైన అనుమతులు పొందాలని, జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఓటరు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకూడదు అని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతకుముందు మాస్టర్ ట్రైనర్ పడాల తిరుపతి పవర్ పాయింట్ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి, అనుమతులు, వంటి అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దివాకర, రాంబాబు, ఆర్డీఓ లు మధుసూదన్, ఆనంద్ కుమార్, డిప్యూటీ సిఇఓ రఘువరన్, రాజకీయ పార్టీల ప్రతినిదులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.