కంకర పోశారు.. బీటీ మరిచారు

కంకర పోశారు.. బీటీ మరిచారు
  • అసంపూర్తిగా పెద్దాపూర్  రోడ్డు పనులు
  • ఇబ్బంది పడుతున్న వాహనదారులు
  • బీటీ వేయకపోవడంతో అవస్థలు
  • త్వరగా పూర్తి చేయాలని డిమాండ్

మెట్‌పల్లి ముద్ర:-గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు కంకర తేలి, గుంతలమయమై అధ్వానంగా మారాయి. గత ప్రభుత్వం బీటీరోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. దీంతో పలుచోట్ల పనులు ప్రారంభించినా అసంపూర్తిగా వదిలేశారు. ఫలితంగా వాహనదారులు, ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ క్యాంప్, పెద్దాపూర్ గ్రామానికి వెళ్ళే రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పూర్తిస్థాయిలో పనులు చేయాల్సి ఉన్నా మధ్యలోనే వదిలేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. 

పంచాయితీ రాజ్ నుంచి నిధులు..

పెద్దాపూర్ క్యాంప్, పెద్దాపూర్ గ్రామ బీటీ రోడ్డు నిర్మాణానికి పంచాయితీ రాజ్ నుంచి ప్రభుత్వం సుమారు రూ.కోటి నిధులు మంజూరు చేసింది. ఐదు నెలల క్రితం ఈ రహదారి పనులను ప్రారంభించారు.కానీ ఇప్పటివరకు పనులు పూర్తికాలేదు. బీటీ వేయాల్సి ఉండగా కంకరపోసి వదిలేశారు. దీంతో అసంపూర్తి పనులతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదని అసహనం వ్యక్తంచేస్తున్నారు.ఏళ్ల క్రితం వేసిన రహదారి దెబ్బతినడంతో ఇబ్బందులు పడ్డ ప్రజలు మొదట నూతన రోడ్డు పనులు ప్రారంభంకాగానే ఆనందపడ్డారు. కానీ అసంపూర్తిగా వదిలేయడంతో పెదవి విరుస్తున్నారు. గురుకుల పాఠశాల కు వెళ్లేందుకు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులకు సమీప ప్రాంతంలోని రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు, నానా అవస్థలు పడుతున్నారు.

వాహనదారుల ఇక్కట్లు..

రోడ్డు పనులు మధ్యలోనే వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం గుండా నిత్యం రాకపోకలు సాగుతుంటాయి. అత్యవసర పనుల నిమిత్తం ఈ మార్గం గుండా వెళ్లేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. జాతీయ రహదారి నుండి 4 కిలో మీటర్ల దూరం ఉన్న రహదారిపై త్వరగా బీటీ వేయాలని, సకాలంలో పనులు పూర్తిచేసి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

పనులు ప్రారంభిస్తాం..యం.నిరంజన్. 

ఏ. ఈ పంచాయితీ రాజ్ మెట్‌పల్లి

రైతులు వ్యవసాయ పనుల కోసం బీటి రోడ్డు పనులు నిలిపివేయాలని కోరడం తో పనులు నిలిపి వేశారు. కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేస్తాం..