గుండెపోటుతో జనగామ జడ్పీ చైర్మన్ మృతి

గుండెపోటుతో జనగామ జడ్పీ చైర్మన్ మృతి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్ : జనగామ జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 
మృతి చెందారు. సంపత్ రెడ్డి స్వగ్రామం జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరంలో 1975 లో జైపాల్ రెడ్డి- సుకన్య దంపతుల వ్యవసాయ కుటుంబంలో మొదటి సంతానంగా జన్మించాడు. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన స్వతహాగా ఇటుక బట్టీల వ్యాపారం చేస్తూ పలువురికి ఉపాధి కల్పించాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలను ఒక తాటిపైకి తెచ్చి అలుపెరుగని పోరాటం చేసి మాజీ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అతి సన్నిహితుడయ్యాడు. కెసిఆర్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో చిల్పూర్ జడ్పీటీసీగా ఎన్నికై కెసిఆర్ ఆదేశాల మేరకు జడ్పీ చైర్మన్ అయ్యాడు. 

నింగికేగిన ఉద్యమం కెరటం..

2001 లో ప్రారంభమైన మలిదశ ఉద్యమంలో పాగాల క్రియాశీలకంగా పనిచేశాడు. ఉద్యమ ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో తన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరుసటి రోజు నుంచి తిరిగి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మొన్న జరిగిన ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశాడు. సోమవారం స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏర్పాటుచేసిన పత్రిక  సమావేశంలో పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలతో కలివిడిగా ఉండే జడ్పీ చైర్మన్ అకాల మరణం జిల్లా ప్రజలను కలిసి వేసింది. మృతుడు సంపత్ రెడ్డికి భార్య సుజాత, కూతురు సంజన రెడ్డి ఉన్నారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యేలు పల్ల రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. సంపత్ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రాజవరంలో మంగళవారం జరగనుంది.