రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు

రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు

ముద్ర ప్రతినిధి,కొల్లాపూర్:-తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు నియమితులయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లికి ఎక్సైజ్, పర్యాటక శాఖను కేటాయించారు. ఇదే శాఖను గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టారు. అలాగే కొల్లాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 1999 నుండి 2023 వరకు 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2018 ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జూపల్లి కృష్ణారావు పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. జూపల్లి కొంతకాలం బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులను గెలిపించుకొని సత్తా చాటారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి బీఫామ్ తెచ్చుకొని సుమారుగా 29 వేల మెజార్టీతో తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి పై గెలుపొందారు. కాంగ్రెస్,బిఆర్ఎస్ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా,పరిశ్రమల శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి టీమ్ లో ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.