ఫార్మసిటీలో భూములు కోల్పోయిన నిరుపేదలకు న్యాయం చేస్తాం - ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఫార్మసిటీలో భూములు కోల్పోయిన నిరుపేదలకు న్యాయం చేస్తాం - ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, ముద్ర : ఫార్మా కు భూములిచ్చిన వారికి ఇండ్ల స్థలాల పంపిణీ
 
గ్రీన్ ఫార్మసిటీలో భూములు కోల్పోయిన నిరుపేదలందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. యాచారం మండల కేంద్రంలోని సాయి శరణం గార్డెన్ లో ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన బాధితులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆర్డీవో వెంకటా చారితో కలిసి భూనిర్వాసితులకు పట్టాలు పంపిణీ చేశారు.

 ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. మేడిపల్లి, తాడిపర్తి, నానక్ నగర్, కుర్మిద్ద గ్రామాల్లో భూములు కోల్పోయిన బాధితులకు ఇప్పటికే పరిహారం చెల్లించామని చెప్పారు. భూములు కోల్పోయిన వారికి ఎకరానికి 121 గజాల చొప్పున ఇండ్ల స్థలాలు కేటాయించి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. హెచ్ఎండిఎ వెంచర్ తరహాలో అన్ని హంగులతో, మౌలిక సదుపాయాలతో టిఎస్ఐఐసి అధ్వర్యంలో 612 ఎకరాల్లో లే అవుట్ చేసి పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మేడిపల్లి గ్రామానికి చెందిన రైతులకు ఎన్ని ఎకరాలు కోల్పోతే అన్ని ఎకరాలకు 121 గజాల చొప్పున ప్లాట్లు కేటాయించినట్లు వివరించారు. భూములు కోల్పోయిన రైతులు పరిహారం తక్కువ వచ్చిందని భాద పడ్డారని, వారికి అత్యంత విలువైన భూమిలో ఇళ్ళ స్థలాల ఇచ్చి ఆడుకుంటున్నట్లు వివరించారు. గతంలో భూసేకరణ నిమిత్తం మాట ఇచ్చిన ప్రకారం ప్రస్తుతం అసైన్డ్ భూములకు సంబంధించి 2336 మందికి ప్లాట్లు, పట్టా భూములకు 2359 మందికి మొత్తం 4670 మందికి పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సి ఎన్నికల కోడ్ కారణంగా పట్టాల పంపిణీ కొంతమేర ఆలస్యం అయ్యిందని, మరో రెండు వారాల్లో అందరికీ పట్టాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఫార్మసిటీకి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే అని, ఇప్పుడు ఫార్మా సిటీ ఏర్పాటును జీర్ణించుకోలేని కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బఫర్ జోన్ ఉంటుందని, మారోమారు భూములు ఇవ్వాలని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇక్కడ ఇంకోసారి భూసేకరణ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో గ్రామాలు ఎక్కడికి పోవని, గ్రామాల్లోనే వ్యవసాయం చేసుకొని జీవించే పరిస్థితులు ఉంటాయని అన్నారు. ఇండ్ల పట్టాలు పొందిన రైతులు వాటిని విక్రయించకుండా ఇళ్లు నిర్మించుకొని బాగుపడాలని సూచించారు.  

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య భాష, జెడ్పీటీసి జంగమ్మ యాదయ్య, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, తహశీల్దార్ సుచరిత, ఎంపిడిఓ విజయ లక్ష్మి, సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి, ఉదయశ్రీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి మల్లేష్, అడాల గణేష్, పిఎసిఎస్ డైరెక్టర్ లు బాషా, స్వరూప, బిఎన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు