జైల్లో ఉన్న నన్ను సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తుంది?: కోర్టులో కవిత పిటిషన్

జైల్లో ఉన్న నన్ను సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తుంది?: కోర్టులో కవిత పిటిషన్
  • తనను సీబీఐ అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్
  • తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసిందన్న కవిత
  • కవిత తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది మోహిత్ రావు
  • తనకు ఈ కేసు గురించి తెలియదన్న డ్యూటీ జడ్జి
  • రేపు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచన

తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తనను సీబీఐ అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జైల్లో ఉన్న తనను ఎలా అరెస్ట్ చేసిందంటూ అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కవిత తరఫున న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన కోర్టును కోరారు.

రిలీఫ్ ఇవ్వలేనన్న డ్యూటీ జడ్జి

ఈరోజు రంజాన్ కావడంతో డ్యూటీ జడ్జి మనోజ్ కుమార్ ఉన్నారు. కవిత తరఫున రాణా, మోహిత్ రావులు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని జడ్జి మనోజ్ కుమార్ పేర్కొన్నారు. తన ముందు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన విచారణ జరగలేదని తెలిపారు. కాబట్టి ఇందులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని స్పష్టం చేశారు. రేపు ఉదయం పది గంటలకు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు.

కాగా, కవితను గత నెల 15న ఈడీ హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఆమెను ఈడీ పది రోజుల పాటు విచారించింది. ఆ తర్వాత ఆమె తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సీబీఐ ఆమెను తమ కస్టడీలోకి తీసుకుంది.