మహిళా స్థిరాస్తి వ్యాపారికి మరణశిక్ష

మహిళా స్థిరాస్తి వ్యాపారికి మరణశిక్ష

హనోయ్: వియత్నాం దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్ కు న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. రియల్ ఎస్టేట్ సంస్థ వ్యాపారిగా బ్యాంకులను మోసం చేసిన కేసులో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ఆమె ఏకంగా 12.5 బిలియన్ డాలర్ల మేరకు.. భారత కరెన్సీలో సుమారు లక్ష కోట్ల రూపాయల కుంభకోణం చేశారని ఆరోపణలు ఉన్నాయి. వాన్ థిన్ ఫాట్ అనే స్థిరాస్తి వ్యాపార సంస్థకు ఆమె చైర్ పర్సన్ గా వ్యవహరించేవారు. అలాగే ఆ దేశంలోని సైగాన్ కమర్షియల్ బ్యాంకు (ఎసీబీ)లో ట్రూంగ్ మై లాన్ కు భారీ వాటా వుంది.

 గత కొన్ని సంవత్సరాలుగా ఈ బ్యాంకులో ఆమె పెద్దస్థాయిలో ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని తేలింది. 2018 నుంచి 2022 సంవత్సారాల మధ్య కాలంలో ఆమె నకిలీ డాక్యుమెంట్లతో వియత్నాం కరెన్సీ 304 ట్రిలియన్ డాంగ్ లను తీసకున్నట్టుగా అధికారులు గుర్తించారు. భారత కరెన్సీలో దీని విలువ లక్ష కోట్ల రూపాయలు ఉంటుంది.  ఈ మోసం 2022లోనే బయటపడిన వెంటనే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి విచారణ జరుగుతుండగా, తాజాగా వియత్నాం కోర్టు తుది తీర్పు వెలువరించింది.