పెద్దపెల్లి ఎంపీ రేసు లో కొప్పుల...

పెద్దపెల్లి ఎంపీ రేసు లో  కొప్పుల...
  • బరిలో దింపేందుకు బీఆర్ఎస్ హై కమాండ్ ఆలోచన..
  • అక్కడ ఓటమితో ఇక్కడ సానుభూతి కలిసొచ్చేనా...!

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:- రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరగనున్న లోక్ సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం స్వయంకృపరాధంతో చేజార్చుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకొని ఆచితూచి అడుగులు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత అభ్యర్థుల ను 30 నుంచి 40 మంది దాకా మార్చాలని భావించి, ఆ తర్వాత సిట్టింగులకే మళ్లీ చాన్సు ఇచ్చారు. దీంతో సర్వే ప్రకారం గా అనుకున్నట్టుగానే చాలాచోట్ల ఓటమిని చవిచూసింది. ఆ అనుభవం ను దృష్టిలో పెట్టుకొని.. తర్వాత జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రజానాడికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ ఎన్నికలను టార్గెట్ గా చేసుకుంటామని బాహాటంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఆ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది అప్పుడే జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయాలలో అత్యంత అనుభవం కలిగి ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో కొప్పుల ఈశ్వర్ కూడా పెద్దపెల్లి ఎంపీ రేసులో ఉండటానికి సమాయత్తం అయినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ధర్మపురి ఎమ్మెల్యేగా ఆరు సార్లు గెలిచిన కొప్పుల ఈశ్వర్ మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందాడు. దీంతో ఈశ్వర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని బీఆర్ఎస్ నాయకులు ముందస్తుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఎన్నికల వాతావరణం మళ్లీ మొదలైనట్లు కనిపిస్తుంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అన్ని సీట్లలో ఘోరంగా ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా పెద్దపెల్లి ఎంపీ సీటు కైవసం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తుంది. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పెద్దపల్లి పై ప్రత్యేక నిగా పెట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని పెద్దపల్లి, మంథని, రామగుండం, చెన్నూరు ,మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలలో మాజీ ఎమ్మెల్యేలతో మంతనాలు కూడా జరిపినట్లు తెలిసింది. దీంతో ముందస్తుగానే కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గాలలో ప్రచారం చేసుకొనునట్లు తెలిసింది. గోదావరి ఖనిలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బహిరంగ సభలోనే ఎంపీగా గెలిపించాలని కోరాడు. దీంతో ఈశ్వర్ పేరు తేరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థి ప్రకటించడం ఎలాగైనా ఆలస్యం అవుతుందని, బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించి, ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ అధిష్టానం సూచించినట్లు తెలిసింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ బరిలో ఉంటాడని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీ అభ్యర్థులు ఎంపీ అభ్యర్థికి తీవ్ర పోటీ నెలకొన్న సందర్భంగా అభ్యర్థులను ప్రకటించడం ఆలస్యం అవుతుందని, దీంతో ఇప్పటినుంచి బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించాలని కేసీఆర్ ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక విధంగా గోదావరిఖనికి చెందిన కొప్పుల ఈశ్వర్ కోల్ బెల్టు ప్రాంతానికి ఎంతో సుపరిచితుడు. ఆయనకు టిక్కెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హై కమాండ్ కూడా భావిస్తోంది. 

బల్క సుమన్ పేరు కూడా పరిశీలనలో ఉందా..?

పెద్దపల్లి మాజీ ఎంపీ కొప్పుల తో పాటు బల్క సుమన్ పేరు కూడా బీఆర్ఎస్ అధిష్టాన పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచిన బాల్క సుమన్ ను బరిలో దింపు తే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ అధిష్టానం ఈశ్వర్ వైపు మొగ్గు చూపుతోందా... లేదా మాజీ ఎంపీ బల్క సుమన్ ను బరిలో నిలుపుతుందా వేచి చూడాలి. సమ్యుడైన కొప్పుల ఈశ్వర్ కి మాజీ ఎమ్మెల్యేలు కూడా మద్దతిస్తున్నట్టు తెలుస్తుంది.