మిస్టరీ వీడింది!

మిస్టరీ వీడింది!
  • రిటైర్డ్ ఎంపీడీఓ హత్యకు భూ వివాదమే కారణం
  • ముగ్గురు నిందితుల అరెస్టు: పరారీలో మరో ఇద్దరు
  • కారు, మూడు మొబైల్స్, రూ.15వేల నగదు స్వాధీనం
  • వివరాలను మీడియాకు వెల్లడించిన వరంగల్ సీపీ రంగనాథ్

ముద్ర ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం కలిగించిన రిటైర్డ్ ఎంపీడీఓ నల్ల రామకృష్ణయ్య (70) హత్య కేసు మిస్టరీ వీడింది. భూ వివాదమే హత్యకు కారణమని తేలింది. ప్రధాన నిందితుడు అంజయ్య మరో నలుగురితో కలిసి హత్యకు పాల్పడ్డారని వరంగల్ సీపీ రంగనాథ్ ఆదివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ఐదుగురు నిందితులలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక కారు, మూడు మొబైల్స్, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరి గురించి వెతుకుతున్నారు. సీపీ కథనం ప్రకారం,  ప్రధాన నిందితుడు గురబోయిన అంజయ్యకు సంబంధించిన భూములపై కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. సర్వేనెంబర్ 174కు సంబంధించిన భూములపై రామకృష్ణయ్య ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసి తనను ఇబ్బంది పెడుతున్నాడని అంజయ్య భావించాడు. అదే అక్కసుతోనే  అతడిని అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేశాడు. తనకు పరిచయం ఉన్న తిరుపతికి రూ. ఎనిమిది లక్షల సుపారి అందించాడు. తిరుపతి రూ.50 వేల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. తిరుపతికి దగ్గర బంధువులైన దోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా, దండుగుల రాజుతో కలిసి హత్యకు వ్యూహరచన చేశారు.
 
కారులో కిడ్నాప్.. హత్య 
ఈనెల15న అంజయ్య ఒక కారు తీసుకొని తిరుపతి గ్యాంగ్ కు అప్పగించాడు. వారు కారుతో సాయంత్రం 5:30కు పోచన్నపేట గ్రామ శివారులో కాపు కాశారు. అదే సమయంలో రామకృష్ణయ్య బచ్చన్నపేట నుండి పోచన్నపేటకు వెళ్తున్నారు. గమనించిన నిందితులు ఆయనను బలవంతంగా కారులో ఎక్కించుకుని చిన్న రామచర్ల గ్రామం వైపు తీసుకెళ్లారు. సాయంత్రం 6:30 సమయంలో కారులో నుంచి దింపి టవల్ తో రామకృష్ణయ్య మెడను బిగించి ఉపిరి ఆడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి ఓబుల్ కేశవపూర్, పెద్దపహాడ్ మీదుగా చంపక్ హిల్స్ ప్రాంతంలోని క్వారీ నీటి గుంటలో పడేశారు. బచ్చన్నపేటకు చేరుకుని రామకృష్ణయ్యను హత్య చేసినట్లు అంజయ్యకు సమాచారం అందించి కారును అప్పగించి వెళ్లిపోయారు. నిందితుడు నిరుడు అక్టోబర్ లోనూ సుభద్ర అనే మహిళను కూడా రూ.2.5 లక్షల సుపారీ హత్య చేయించాడని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం, జనగామ ఏసీపీ దేవేందర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, నర్మెట్ట సీఐ నాగబాబు, బచ్చన్నపేట ఎస్సై నవీన్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రాంబాబు, ఎస్సై దేవేందర్, సిబ్బందిని సీపీ అభినందించారు.