Layoffs in Wipro: విప్రోలో లేఆఫ్స్.. వందల మందిని సాగనంపేందుకు ప్లాన్!

Layoffs in Wipro: విప్రోలో లేఆఫ్స్.. వందల మందిని సాగనంపేందుకు ప్లాన్!
  • మిడ్ లెవెల్ ఉద్యోగులను తొలగించనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు
  • లాభాలా మార్జిన్ల పెంపునకు ప్రయత్నిస్తున్న విప్రో
  • తొలగింపులపై మౌనం వహించిన కంపెనీ ప్రతినిధి

భారత్ ఐటీ దిగ్గజం విప్రో కూడా త్వరలో లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. లాభాలు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్న సంస్థ మిడ్ లెవెల్ ఉద్యోగులను వందల సంఖ్యలో తొలగించే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియా చెబుతోంది. భారత్‌లోని నాలుగు ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన విప్రో లాభాల మార్జిన్లు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంటే తక్కువగా ఉన్నట్టు తెలిసింది. 

అయితే, తొలగింపుల పర్వాన్ని కంపెనీ ఇప్పటికే ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘ఈ నెల మొదట్లోనే ఉద్యోగులకు ఈ మేరకు సమాచారం అందింది. ఆన్‌సైట్‌లో ఉన్న వందల మంది మిడ్ లెవెల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులను సాగనంపనున్నారు. వీళ్లల్లో చాలా మంది భారీ జీతాలు తీసుకుంటున్నారు’’ అని పేర్కొన్నాయి. కాగా, లాభాల మార్జిన్లు మెరుగుపరిచే బాధ్యతను సీఎఫ్‌ఓ అపర్నా అయ్యర్‌కు సంస్థ అప్పగించింది. ఈ వార్తలపై స్పందించిన సంస్త ప్రతినిధి ఒకరు తొలగింపులపై ఎటువంటి విస్పష్ట ప్రకటన చేయలేదు. అయితే, సంస్థ వ్యాపారాలు, వనరులను మారుతున్న పరిస్థితులకు అనుగూణంగా సిద్ధం చేయాలని వ్యాఖ్యానించారు. 

తొలగింపుల్లో భాగంగా సంస్థ లెఫ్ట్ షిఫ్ట్ పద్ధతిని అనుసరించబోతున్నట్టు తెలిసింది. ‘‘లెవెల్ 3 ఉద్యోగి బాధ్యతలు లెవెల్ 2 ఉద్యోగికి వెళతాయి. లెవెల్ 2 బాధ్యతలు లెవెల్ 1కు మారతాయి. ఇక లెవెల్ 1 బాధ్యతలను ఆటోమేట్ చేయాలి. ఇవి అన్ని కంపెనీలు చేస్తున్నాయి’’ అని విశ్వనీయ వర్గాలు వ్యాఖ్యానించాయి.