హత్య కేసులో జీవిత ఖైదు

హత్య కేసులో జీవిత ఖైదు

ముద్ర ప్రతినిధి భువనగిరి : హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు పది వేల రూపాయల జరిమాన విదిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు సోమవారం తీర్పునిచ్చారు. వివరాల ప్రకారం తుర్కపల్లి మండలం మాధాపూర్ గ్రామంకు చెందిన ఎర్రబెల్లి వెంకటేశం తన భార్య కృష్ణవేణితో తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు. 24 డిసెంబర్ 2021 సంవత్సరంలో అదేవిధంగా గొడవ పడుతున్న తరుణంలో కృష్ణవేణి అన్న రాచకొండ రమేష్ తన చెల్లితో ఎందుకు గొడవ పడుతున్నావ్ అని ఎర్రబెల్లి వెంకటేశంను ప్రశ్నించగా కోపంతో తన బావ అగు రాచకొండ రమేష్ ను ఇటుకతో తీవ్రంగా గాయపరచగా రాచకొండ రమేష్ గాయాలతో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు.

మృతుని భార్య అనిత తుర్కపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా అప్పటి సి. ఐ. బి. నవీన్ రెడ్డి, ఎస్. ఐ. ఎల్. మధు బాబులు కేసు విచారణ జరిపించారు. కేసు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో పూర్తి విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఎర్రబెల్లి వెంకటేశం కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు జీవిత ఖైదు పది వేల రూపాయల జరిమాన విదిస్తూ తీర్పు వెలువరించారు. కేసు విచారణలో జి. శ్రీనివాస్ రెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటరుగా వ్యవహరించగా తుర్కపల్లి కోర్టు కానిస్టేబుల్ అశోక్ విధులు నిర్వర్తించారు.