అభివృద్ధి చేశాం ఆదరించండి..

అభివృద్ధి చేశాం ఆదరించండి..
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:భూపాలపల్లి నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశామని, బీఆర్ఎస్ ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని వెంకటేశ్వర్లపల్లి, పరశురాంపల్లి, ధర్మరావుపేట, చెల్పూరు, లక్ష్మారెడ్డిపల్లి, గాంధీ నగర్, మైలారం గ్రామాలలో గురువారం పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో  ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ కోట్లాది రూపాయల నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానిక నాయకుల సహకారం, ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రత్యేక చొరవతో చెల్పూర్ గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసుకున్నామని ఓటు అడిగే హక్కు మనకే ఉందన్నారు. నవంబర్ 30న ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థిగా భావించి ప్రజలను ఓట్లు అడగాలని కోరారు. గడిచిన10 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, పట్టణాలను, పల్లెలను అభివృద్ధి చేసుకున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న కరువు కాటకాలు నేడు ముఖ్యమంత్రి  నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన 2023 ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రతి పథకం పై పూర్తిస్థాయిలో అవగాహన ఉండేలా ప్రజలకు చేరేలా విస్తృత పర్యటనలు, ప్రచారాలు నిర్వహించాలని కోరారు.

చెల్పూర్ భూపాలపల్లి పట్టణానికి అతి సమీపంలో ఉన్న గ్రామమని, అత్యధిక ఓట్లు కలిగిన గ్రామం చెల్పూర్ కాబట్టి కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేసే మండలంలోని అత్యధిక మెజార్టీ వచ్చేలా ప్రచారం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పట్ల ప్రతిపక్ష పార్టీలు కాపీ కొడుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని, అధికారంలో ఉండి అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూస్తూ ప్రజలకు అవసరమైన అనుకూలమైన పథకాలను ప్రవేశపెట్టి, ముఖ్యమంత్రి  తీసుకొచ్చిన మేనిఫెస్టో ఎవరి నుంచి కాపీ చేసింది కాదని తెలంగాణ నలుమూలల, అణువణువు తెలిసిన వ్యక్తిగా ఈరోజు మేనిఫెస్టో ప్రవేశ పెట్టారని, మేనిఫెస్టోలోని ప్రతి అంశం అమలుకు ఆమోదయోగ్యంగా ఉంది కాబట్టే ఈ రోజు ప్రజలు భారత రాష్ట్ర సమితి పార్టీకి పట్టం కట్టేలా ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.