రాహుల్ గాంధీకి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం

రాహుల్ గాంధీకి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం
  • ఎఐసిసి సెక్రటరీ,మంతని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
  • కాటారంలో కాంగ్రేస్ పార్టీ రాస్తారోకో,..
  • ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం

ముద్ర న్యూస్, కాటారం: అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్తారని ఏఐసిసి సెక్రటరీ, మంతని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక అణిచివేత చర్యలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగుతున్నారని మోదీ విధానాలకు నిరసనగా శుక్రవారం కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి, నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ ఆందోళనకు హాజరైన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల నేతలను ప్రధాని నరేంద్ర మోదీ,హోం మంత్రి అమిత్ షాలు అణిచివెయ్యాలని చేస్తున్న పన్నాగాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం అనర్హతపై స్టే కోసం వేసిన పిటిషన్ గుజరాత్ హైకోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

తన అనుయాయులతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర పూరిత రాజకీయ కక్ష సాధింపు ధోరణి చర్యలకు దిగుతున్నదని ఆరోపించారు.రాహుల్ గాంధీకి న్యాయం జరిగే వరకు  ప్రజలతో కలిసి ఆయనకు వెన్నంటి ఉండి పోరాటం చేస్తామని పేర్కొన్నారు.మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలైన సిబిఐ,ఈడి,ఐటి లను ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీల నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. బిజెపి పార్టీ బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరించారు. భారత్ జోడోయాత్రతో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగిందని రానున్న ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుందని జోస్యం చెప్పారు.భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ యేనని వివరించారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల పరిషత్ ప్రెసిడెంట్ పంతకాని సమ్మయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి,బడితెల రాజయ్య, రఘురాం నాయక్, చీర్ల తిరుపతిరెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆంగోత్ సుగుణ తదితరులు పాల్గొన్నారు.