బండికి అభివృద్ధి పై శ్రద్ధ ఉండదు

బండికి అభివృద్ధి పై శ్రద్ధ ఉండదు
  • వినోద్ కుమార్ ప్రతిపాదించిన పనులకు మోడీ శంకుస్థాపన
  • 100 కోట్లు అవినీతి చేయలేదని నిరూపించుకో
  • మేయర్ వై సునీల్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంటు సభ్యునిగా బండి సంజయ్ ఎన్నికై నాలుగు సంవత్సరాలు పూర్తికావస్తున్న చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఆరోపించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతగా ఉంటూ అభివృద్ధి చేయాలన్న శ్రద్ధ బండి సంజయ్ కి ఉండదని మండిపడ్డారు. పార్లమెంటు సభ్యునిగా గత నాలుగు సంవత్సరాల్లో  తీసుకువచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బోయినపల్లి వినోద్ కుమార్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సమయంలో ప్రతిపాదించిన ఎన్ హెచ్ 563 నాలుగు వరసల రోడ్డుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తున్నారని పేర్కొన్నారు.


ఎప్పుడో మంజూరై పనులు నడుస్తుంటే ఇప్పుడు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం చేయించడం ఎంటని ప్రశ్నించారు.నిన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలంటే ప్రధానమంత్రి మోడీ తో కరీంనగర్ కు ప్రత్యేక ప్యాకేజ్ మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.కాజీపేట- కరీంనగర్ రైల్వే లైన్ కు ఇప్పటికి భూముల సర్వే ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.షామీర్ పేట నుండి జూబ్లీ బస్టాండ్ వరకు ఫ్లైఓవర్ కోసం రక్షణ శాఖ భూములను కేటాయించేలా ప్రధానితో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. 100 కోట్ల అవినీతి చేసినందుకే రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించారని బిజెపి శ్రేణులే చర్చించుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. దీనిపై కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.ఈ సమావేశంలో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.