తాను మాట్లాడిన ఏ అంశం పైన చర్చకు సిద్ధం....

తాను మాట్లాడిన ఏ అంశం పైన చర్చకు సిద్ధం....
  • దళిత బంధు అమలుపై...
  • షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామన్న హామీ లపై చర్చకు సిద్ధమా..
  • మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తాను మాట్లాడిన ప్రతి అంశంపై చర్చించేందుకు తాను ఎల్లవేళల సిద్ధంగా ఉన్నానని దళిత బంధు అమలు, షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామన్న హామీలపై మీరు చర్చకు సిద్ధమా అని మంత్రి సవాలుపై ప్రతి సవాలు విసిరారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ తో పాటు పలు అంశాలఫై వాస్తవాలను వక్రీకరిస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నది ఎవరో ప్రజలకు తెలుసని అలాంటివారికి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ తో పాటు తాను మాట్లాడిన ఏ అంశం పైన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. టిడిపి హయాంలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యం లో కొనసాగిన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పూర్తిస్థాయిలో ప్రభుత్వమే నిర్వహిస్తామని ఇచ్చిన ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. దళిత బంద్ కోసం 2022- 23 బడ్జెట్లో 17700 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఏ ఒక్కరికి లబ్ధి చేకూర్చకపోయినా ఆ శాఖ మంత్రి ఈశ్వర్ నోరు మెదపడం లేదని అన్నారు.

తన జాతికి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేని మంత్రి ఈశ్వర్ కు తనపై సవాలు విసిరే అర్హత ఉందా అని ప్రశ్నించారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి రూ. 3 లక్షల పథకం కోసం బడ్జెట్లో 12 వేల కోట్లు కేటాయించగా ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు. బీసీలకు లక్ష రూపాయల పథకం లో పలు బీసీ కులాలకు స్థానం కల్పించకపోవడం బీసీ వర్గాలను మోసం చేయడమే అన్నారు. మీ మంత్రిత్వ శాఖ సంబంధించిన అంశమైన, మరో అంశమైన తాను చర్చకు సిద్ధమని ఎమ్మెల్సీ సవాల్ చేశారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల జనవాసాలకు దూరంగా ఉండాలన్న సోయ్ కూడా మంత్రికి లేపక లేకపోవడం దురదృష్టకరమన్నారు. రైతులఫై ప్రేమ ఉంటే అదే క్రిబ్కో ఆధ్వర్యంలోనే చెక్కర ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

ఏడాదంతా నీటి లభ్యత ఉండే కాళేశ్వరంలోనే 420 టీఎంసీల నీటి ఎత్తిపోసే సౌలభ్యం ఉండగా మూడవ టీఎంసీ పేరిట రైతుల నోట్లో మట్టి కొట్టుడెందుకని ప్రశ్నించారు. మూడో టిఎంసి భూములకు బహిరంగ మార్కెట్లో ఎకరాకు రూ. 40లక్షలు పలుకుతుండగా ఎగరాకు 10 లక్షలు ఇచ్చి రైతులను దగా చేసింది మీ ప్రభుత్వం కాదని ప్రశ్నించారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఈశ్వర్ గ్రహించాలన్నారు. ఈ సమావేశంలో పిసిసి సభ్యుడు గిరి నాగభూషణం, నాయకులు కల్లపల్లి దుర్గయ్య, బండ శంకర్ గాజుల రాజేందర్, జిన్ను రాజేందర్, మన్సూర్, గుండ మధు, భీరం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.