అభివృద్ధి పథంలో మేడ్చల్ జిల్లా ..

అభివృద్ధి పథంలో మేడ్చల్ జిల్లా ..
  • ఘనంగా  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు...
  • త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన  మంత్రి మల్లారెడ్డి... 

ముద్ర ప్రతినిధి, మేడ్చల్:మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ముందుంచామని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జిల్లాకలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు. జిల్లాను అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్ళి అభివృద్దిలో ముందుంచేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధులు జనబాయి ని శాలువా తో సత్కరించారు. అనంతరం ఆయా పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన   సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను ఎంతగానో  అలరించాయి.

ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని 285 స్వయం సహాయక సంఘాలకు(సెల్ఫ్ హెల్ప్ గ్రూపు) రూ.22 కోట్ల 55 లక్షల నిధులను ఆ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజారాణికి చెక్కు రూపకంగా అందించారు. అలాగే మెప్మా వారికి 521 స్వయం సహాయక సంఘాలకు, రూ.47 కోట్ల 98 లక్షలకు సంబంధించిన చెక్కును పీడీ అనిల్ కు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,అందచేశారు.  
ఈ కార్యక్రమంలో జెడ్ పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,  అదనపు కలెక్టర్లు విజయేందర్ రెడ్డి , అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ డీసీపీ శబరీష్ , ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది  పాల్గొన్నారు.