క్రీడలతో  యువతకు మానసిక ఉల్లాసం

క్రీడలతో  యువతకు మానసిక ఉల్లాసం

  • యువత చెడు వ్యసనాలు మాని క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలి
  • సమాజ సేవలో యువత భాగస్వామ్యం కావాలి
  • -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ముద్ర, కోరుట్ల: క్రీడలతో మానసిక ఉల్లాసం ఉంటుందని,యువత చెడు వ్యసనాలు మాని క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలనీ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం కథలాపూర్ గ్రామంలో బృందావనం ఫ్యామిలీ కేఫ్, భూషణ్ రావు పేట గ్రామంలో కథలాపూర్ ప్రీమియం సీజన్-2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ నూతన వ్యాపారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారులకు మంచి సేవలందించాలని తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి, మంచి ఆరోగ్యానికి దోహదపడతాయని అన్నారు. యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని, తల్లిదండ్రులు కూడా యువతకు సహకరించాలన్నారు. క్రీడలతో యువత మధ్య స్నేహభావం పెంపొందుతుందని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రావడం వల్ల ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు.

రానున్న రోజుల్లో కథలాపూర్ మండల పరిధిలో క్రీడాకారులకు అనువైన స్థల సేకరణ చేసి మినీ స్టేడియం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. యువత చెడు వ్యసనాలకు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసకా వద్దన్నారు. వాటి వల్ల అనారోగ్య సమస్యలతో పాటు సమాజంలో దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  గంజాయి రహిత రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. యువకులు క్రీడాకారులు సమాజంలో ఎవరైనా గంజాయి వైపు, మత్తువైపు వెళితే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సన్మార్గంలో నడిపించుటకు తోడ్పాటును అందించాలన్నారు. యువకులు క్రీడలతో పాటు సామాజిక సేవలు చేస్తూ సాంఘిక దురాచారాలను రూపుమాపాలని, సమాజంలో ఒక ప్రశ్నించే గొంతుకలుగా ఉండాలన్నారు. సమాజం పట్ల అవగాహన పెంచుకుంటూ సమాజ సేవ చేస్తూ ముందుకు పోవాలన్నారు. యువత గ్రామాల్లో సమస్యల పట్ల అవగాహన పెంచుకుంటూ, సమాజంలో తమకంటూ గుర్తింపు వచ్చేలా సేవ చేస్తూ ముందుకు పోవాలన్నారు.