రామాయణం రాసిన వాల్మీకిది.. భాగవతం రాసిన పోతనది మన నియోజకవర్గమే..!! 

రామాయణం రాసిన వాల్మీకిది.. భాగవతం రాసిన పోతనది మన నియోజకవర్గమే..!! 
  •  పాలకుర్తికి అంత చరిత్ర ఉంది..
  •  ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి దయాకర్ రావు

 ముద్రప్రతినిధి, మహబూబాబాద్: రామాయణం రాసిన వాల్మీకిది.. భాగవతం రాసిన బమ్మెర పోతన ది మన నియోజకవర్గమేనని, అంతటి ఘనచరిత్ర పాలకుర్తి నియోజకవర్గంకు ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన భారస ఆత్మీయ సమ్మేళనాల్లో  ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తాను పనిచేస్తున్నానని, ఆ..లక్ష్యం దిశగా ఇప్పటికే చాలా సాధించానని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం లోని వాల్మీడీలో రామాయణాన్ని రాసిన వాల్మీకి జన్మించారని 50 కోట్ల రూపాయలతో వాల్మీడిని అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. భాగవతాన్ని రాసిన పోతన పాలకుర్తి నియోజకవర్గం లోని బమ్మెరలోనే జన్మించారని ఆ ప్రాంతాన్ని కూడా బాసర తరహాలో రూ.50కోట్లతో అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. పాలకుర్తి ఆలయాన్ని, సన్నూరు వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని కూడా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసానన్నారు.

పాలకుర్తి నియోజకవర్గంలో గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో, పాలకుర్తి నియోజకవర్గం మౌలిక సౌకర్యాల కల్పనలో ముందంజలో ఉందన్నారు. వచ్చే ఐదు సంవత్సరాలు పూర్తిగా కార్యకర్తల సంక్షేమంపైనే దృష్టి సారిస్తానని 15 సంవత్సరాలుగా తన వెంట నడుస్తున్న కార్యకర్తలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతానన్నారు. అందులో భాగంగా ప్రతి గ్రామం నుండి సుమారు 100 నుండి 200 మందిని ఎంపిక చేసుకొని వారి సంక్షేమం కోసం పనిచేస్తానని తెలిపారు. మన పార్టీలో మనం ఏ..విషయాలైన మాట్లాడుకోవచ్చని, వేరే పార్టీవాడు బిఆర్ఎస్ గురించి మాట్లాడితే మాత్రం కచ్చితంగా నిలదీయాలని తెలిపారు.

ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని, మీ ఆశీర్వాదంతో ఆయన మంత్రి పదవిని కూడా పొందారని అన్నారు. వచ్చేసారి ఎర్రబెల్లిని గెలిపిస్తే మరింతగా పాలకుర్తి నియోజకవర్గం బిఆర్ఎస్ కార్యకర్తలు అభివృద్ధి చెందుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సహపంక్తి భోజనం చేశారు.