న్యాయం చేయండి..! హైకోర్టు జడ్జికి విద్యార్థుల లేఖ..

న్యాయం చేయండి..! హైకోర్టు జడ్జికి విద్యార్థుల లేఖ..
Students letter to High Court Judge

(కేసముద్రం-ముద్ర): తెలుగు హిందీ బోధించే ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం న్యాయపోరాటం చేస్తూ చదువు చెప్పడం మానేశారు.. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి.. ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించి తమకు న్యాయం కోరుతూ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ,10వ తరగతి విద్యార్థులు ఏకంగా మంగళవారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టు కార్డులు రాశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుంచి తెలుగు, హిందీ బోధించే ఉపాధ్యాయులు తమ పదోన్నతుల కోసం పోరాటంలో భాగంగా పాఠాలు చెప్పడం నిలిపివేశారు. వారి సమస్య కోర్టు పరిధిలో ఉన్నదని చెబుతున్నారు. పదోన్నతుల విషయంలో ఉపాధ్యాయులు పాఠశాలకు వస్తున్నప్పటికీ నిరసనగా విద్య బోధన మానేశారని విద్యార్థులు చెప్పారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్జిగారు తెలుగు హిందీ భాష ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని  కోరుతూ ఉత్తరాలు రాసి పోస్ట్ చేసినట్లు తెలిపారు.