ధాన్యం ఎగుమతి బాధ్యత మీదే!

ధాన్యం ఎగుమతి బాధ్యత మీదే!
  • చేతులెత్తేసిన కొనుగోలు
  • ట్రాక్టర్ల కోసం రైతుల వెతుకులాట

కేసముద్రం, ముద్ర: ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసిన నిర్వాహకులు మిల్లులు గోదాములకు చేసే బాధ్యతను రైతులపైకి తోసేశారు. దీనితో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిధిలో 25వేల బస్తాల ధాన్యం ఎగుమతి చేయడానికి రైతులు ట్రాక్టర్ల కోసం వెతుకులాట ప్రారంభించారు. కేసముద్రం సొసైటీ పరిధిలో 8 గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇనుగుర్తి, తాళ్లపూస పల్లి, అన్నారం గ్రామాల్లో కేంద్రాల్లో కాంటాలు పూర్తిచేసి ఎగుమతి చేయడానికి 25 వేలకు పైగా ధాన్యం బస్తాలు అక్కడే ఉన్నాయి. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు శుక్రవారం ఉన్నట్టుండి ధాన్యం ఎగుమతి బాధ్యతను రైతులే చూసుకోవాలంటూ ప్రకటించారు. కేసముద్రం, గూడూరు మండలాల్లో ఉన్న మిల్లులు గోదాముల్లోకి ఆయా కేంద్రాల్లో కాంటాలు పూర్తిచేసిన ధాన్యం బస్తాలను రైతులే ట్రాక్టర్ల ద్వారా ఎగుమతి చేసుకోవాలంటూ తేల్చి చెప్పడంతో రైతులు ట్రాక్టర్ల కోసం తిరుగుతున్నారు. ఇటీవల కొందరు రైతులు ట్రాక్టర్ల ద్వారా మిల్లులు గోదాములకు ధాన్యాన్ని తీసుకువెళ్లగా, మిల్లర్లు దిగుమతి చేసుకోవడానికి ఇబ్బందులు పెట్టడంతో రెండు నుంచి మూడు రోజులు అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. దీనితో ట్రాక్టర్ల యజమానులు ధాన్యం తోలకానికి వెనుక ముందు ఆడుతున్నారు. ఫలితంగా రైతులు ట్రాక్టర్ ఓనర్లను బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పండించేటప్పటి నుంచి కొనుగోలు కేంద్రం వరకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ధాన్యాన్ని మిల్లుకు తరలించడం మరో ఎత్తని రైతులు చెబుతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులు గోదాములకు ఎగుమతి చేయాల్సిన బాధ్యత కొనుగోలు కేంద్రం నిర్వాహకులదే అయినప్పటికీ, ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, ఆ బాధ్యత మీదేనంటూ మా నెత్తిన రుద్దటం ఏ మేరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇనుగుర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 15,000 బస్తాలు, తాళ్ల పూసపల్లిలో 7,500, అన్నారంలో 2,500 బస్తాలు ఎగుమతి చేయాల్సి ఉంది. వర్షాకాలం నెత్తిమీదికి వస్తుండడంతో రెండు మూడు రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులు గోదాములకు ఎగుమతి చేయకపోతే ‘వర్షార్పణం' కావాల్సిందేనని రైతులు చెబుతున్నారు. 

అప్పుడే చెప్తే ధాన్యాన్ని తోలుకునేటోళ్లం: కోమాకుల శీను- రైతు

ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చి కాంటాలు పూర్తి చేసి 15 రోజులు కావస్తోంది. అప్పుడే చెబితే ఇప్పటివరకు ఏదో తిప్పలు పడి ధాన్యాన్ని మిల్లుకు తోలుకునేటోళ్లం. లారీలు పెడతాం, ధాన్యాన్ని మేమే మిల్లుకు గోదాంకు తరలిస్తాం అని చెప్పి, కాలం వెళ్లబుచ్చిన నిర్వాహకులు ఇప్పుడు ఉన్న ఫలంగా ధాన్యాన్ని మీరే ట్రాక్టర్ల ద్వారా తోలుకోవడం ఏ మేరకు సమంజసమని కోమాకుల శీను అనే రైతు వాపోయాడు. ట్రాక్టర్ల కోసం తిరుగుతున్నాం, ఎక్కడ దొరకట్లేదు, దొరికినా ఎక్కువ కిరాయి అడుగుతాండ్లు. చేతుల పైసలు లేవు. దాన్యం ఎట్లా తోలుకోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.