షర్మిల వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్..

షర్మిల వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్..
  • నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి
  • బొడ్రాయి అమ్మవారికి తిరుగు బోనం సమర్పించిన మంత్రి
  • జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలి
  • సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి: మంత్రి సత్యవతి రాథోడ్..

ముద్రప్రతినిధి‌, మహబూబాబాద్: ప్రజా ప్రస్థానం పాదయాత్ర సమయంలో షర్మిల నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలంటూ రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హితవు పలికారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, ఎంపీ కవితపై వైఎస్ఆర్ టి పి అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆదివారం మంత్రి స్పందించారు.  సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని, ఇక్కడ ఇతర నాయకుల పాలన అవసరం లేదని పేర్కొన్నారు. రాజన్న రాజ్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగిందని మంత్రి గుర్తుచేశారు.  

మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని


ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని మంత్రి వివరించారు. సీఎం కేసీఆర్‌, తెలంగాణ ఉద్యమ కారులపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అండదండలతో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయి   కోట్ల ఆస్తులకు యజమానులు అయ్యారు అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే అని గుర్తు చేశారు. అలాంటి రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని తుంగలో తొక్కి ఆ పార్టీ ద్వారా సంపాదించుకున్న వేలకోట్లతో వేరే పార్టీ పెట్టి ఊరేగుతుంది మీరంటూ  విమర్శించారు. ఇప్పటికైనా పరిమితుల మేరకు పాదయాత్ర చేసుకోవాలని, అతిక్రమించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.  మహబూబాబాద్ పట్టణ బొడ్రాయి పునః ప్రతిష్టాపన అనంతరం    బొడ్రాయి తల్లికి  బోనం సమర్పించి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా అమ్మవారి కటాక్షం ఉండాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.