కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించాలి

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించాలి

ఇఫ్టూ జాతీయ అధ్యక్షుడు సాధినేని వెంకటేశ్వరరావు

కేసముద్రం, ముద్ర: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సంఘటితంగా ఎదిరించడానికి సన్నద్ధం కావాలని ఇఫ్టూ జాతీయ అధ్యక్షుడు సాధినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఇఫ్టు రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జడ సీతారామయ్య అధ్యక్షతన జరిగింది.

ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయడంలో దూకుడు పెంచిందని ఆరోపించారు. విశాఖ ఉక్కు, ఆయిల్, రక్షణ, విమానయానం, ఎల్ఐసి, బ్యాంకులు తదితర ప్రభుత్వరంగ పరిశ్రమలను పూర్తిస్థాయిలో ప్రైవేటీకరించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఆరోపించారు రక్షణ రంగానికి సంబంధించి 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను, 9 ట్రైనింగ్ సెంటర్ ల, 52 పరిశోధనా సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అంటే దేశ రక్షణ, ప్రజా భద్రత బాధ్యత నుండి ప్రభుత్వం వైదొలగడమేనన్నారు.

అలాగే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను సంక్షోభంలో కూరుకు పోయాయనే పేరుతో కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా దారదత్తం చేస్తోందని ఆరోపించారు. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తూ రక్షణ వ్యవస్థను సైతం ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా సంఘటితమై ఎదిరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జి.అనురాధ, కె.విశ్వనాథ్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎండి రఫీయోద్దిన్, శివ బాబు, శివారపు శ్రీధర్, రాష్ట్ర కోశాధికారి వరదయ్య, రాష్ట్ర నాయకులు ఎల్ విశ్వనాథం, నాగరాజు, ఎస్.కె మదార్, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.