నిస్వార్థ సేవకు దక్కిన పురస్కారం- యాకమ్మకు అరుదైన గౌరవం

నిస్వార్థ సేవకు దక్కిన పురస్కారం- యాకమ్మకు అరుదైన గౌరవం

కేసముద్రం- ముద్ర: ఉదయం లేచిందే తడవు తన ఇంటి కంటే ముందు ఊరు పరిశుభ్రంగా ఉండటమే ముఖ్యమని భావిస్తూ 20 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలిగా ప్రజలకు చేస్తున్న సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పురస్కారం అందించి సత్కరించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని గురువారం రాత్రి రాష్ట్ర రాజధాని హైదరాబాదు రవీంద్రభారతిలో నిర్వహించిన పల్లె ప్రగతి రాష్ట్రస్థాయి కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా నుంచి ఇనుగుర్తి మేజర్ పంచాయతీకి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు గుజ్జునూరు యాకమ్మ సేవలను గుర్తించి ప్రశంసా పత్రం, మేమెంటో అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. వృత్తి నిబద్ధతతో పనిచేస్తే ప్రజల్లో తగిన గుర్తింపు ఉంటుందనడానికి పారిశుద్ధ్య కార్మికురాలు యాకమ్మ నిదర్శనంగా నిలుస్తోంది.

యాకమ్మ భర్త ఉప్పలయ్య గ్రామపంచాయతీలో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్తు పోల్ పైనుంచి పడి తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితం కాగా, కుటుంబ పోషణ నిమిత్తం అప్పట్లో యాకమ్మ సఫాయిగా విధుల్లో చేరింది. భర్త మరణం తర్వాత ఐదుగురు ఆడపిల్లల తోపాటు కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకుని రెక్కల కష్టంతోనే ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసింది. ఉదయం లేచిందే తడవు యాకమ్మ చీపురు, పార పట్టుకుని తనకు కేటాయించిన ప్రదేశాన్ని పరిశుభ్రం చేయడమే పరమవదిగా పెట్టుకుంది. కరోనా కష్టకాలంలో సైతం ప్రాణానికి తెగించి పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమైంది. చాలీచాలని వేతనంతో మొదలెట్టిన తన వృత్తి ధర్మాన్ని ఇప్పటివరకు కొనసాగిస్తున్న యాకమ్మ సేవలను గ్రామస్తులతోపాటు ప్రభుత్వం గుర్తించడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. 

అవార్డు ఏం చేసుకోవాలో సారు? జీతం పెంచండి!

పొట్టకూటి కోసం మా ఆయన ఉండంగనే సఫాయి పనిలో చేరిన. ఇప్పుడు నెలకు 8,500 రూపాయలు జీతం ఇత్తాండ్లు. అవి ఏ మూలకు సరిపోతా లేవు. అవి కూడా చక్కగా నెల నెల ఇత్తలేరు. జీతం సక్కగా ఇయ్యకపోయినా పొద్దున లేవంగనే చీపురు, పార పట్టుకొని ఊరంతా శుభ్రం చేత్తాన. అవార్డు, శాలువా ఏం చేసుకోవాలో సారు, జీతం పెంచితే అదే సాలు అంటూ యాకమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. గవర్నమెంట్ సార్లు, సీఎం కేసీఆర్ సారు నేను చేస్తున్న కష్టానికి తగ్గట్టు జీతం పెంచాలని యాకమ్మ వేడుకుంది.