నిర్మల్, బాసరలో ఉద్రిక్తత

నిర్మల్, బాసరలో ఉద్రిక్తత
  • ఎక్కడికక్కడ అరెస్టులు
  • వీసీని అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ నేఃతలు 
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

నిర్మల్, ముద్ర ప్రతినిధి:-నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం విద్యార్థిని లిఖిత మృతిపై అనుమానాలున్నాయంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. బీజేపీజిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి నేతృత్వంలో ధర్నా నిర్వహించి ఐఐఐటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. నిర్మల్ ప్రధాన ఆస్పత్రి ఎదుట బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇన్చార్జ్ వీసీ వెంకటరమణను అడ్డుకున్నారు. ‘వీసీ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. వెంకటరమణను, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మెడిసెమ్మె రాజు, శ్రావణ్ తదితరులున్నారు. నిర్మల్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిమిత్తం ఉంచిన లిఖిత మృతదేహాన్ని ప్రతిపక్షాల నేతలు సందర్శించారు. అనంతరం కాంగ్రెస్ నేత అల్లూరి మల్లారెడ్డి మాట్లాడుతూ ఐఐఐటీలో విద్యార్థులు పిట్టల్లా రాలి పోతుంటే జిల్లా మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపట్టడం లేదన్నారు. కౌన్సెలింగ్ కోసం కమిటీ ఏర్పాటు చేస్తామన్న అధికారులు నిద్ర పోతున్నారన్నారు. 

పొంతన లేని సమాధానాలు

లిఖిత మృతిపై అధికారులు పొంతన లేని సమాధానాలు ఇవ్వటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. లిఖిత మొబైల్ చూస్తూ ప్రమాదవశాత్తూ పైనుంచి కింద పడిందని వీసీ వెంకట రమణ  చెబుతున్నారు. కుక్కలు తరమటంతో పైకి పరిగెత్తిందని, ఈ క్రమం లో కింద పడి మరణించిందని కాగా వార్డెన్ కథనం. ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. సాయంత్రం నాలుగు దాకా తల్లిదండ్రులను దేహాన్ని చూసేందుకు అనుమతించలేదు.