ఈసారైనా సత్తన్న గట్టెక్కేనా..

ఈసారైనా సత్తన్న గట్టెక్కేనా..
  • ఇప్పటికే రెండుసార్లు ఓటమి.. 
  • మూడోసారి కాంగ్రెస్ నుండి పోటీ..

 ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ఈసారైనా గండ్ర సత్యనారాయణ రావు ఎమ్మెల్యేగా గట్టెక్కినా అనే ప్రశ్నలు భూపాలపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే భూపాలపల్లి నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సత్యనారాయణరావు అతి తక్కువ ఓట్లతో ఓటమిపాలయ్యారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా సత్యనారాయణ రావు రంగంలోకి దిగుతున్నారు. గతంలో బీజెపీ, ఏఐఎఫ్ బీ పార్టీల నుండి ఎమ్మెల్యేగా గట్టి పోటీ ఇచ్చిన సత్యనారాయణరావు ఈసారి బలోపేతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగుతున్నారు. రెండుసార్లు ఓటమిపాలైనా, నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నారు. గతంలో టిడిపి పార్టీలో పనిచేసిన సత్యనారాయణ రావు అంచెలంచెలుగా నియోజకవర్గంలో మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. గ్రామ గ్రామానా అతని అనుచరులు, కార్యకర్తలను కాపాడుకుంటూనే ప్రజల మద్దతును కూడబెట్టుకుంటున్నారు.

ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎవరికి ఆపద వచ్చిన నేనున్నానంటూ మద్దతుదారులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న సత్యనారాయణరావు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి  ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి సమారు నాలుగేళ్ల క్రితం అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరగా అప్పటినుండి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థులు కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో బలమైన నాయకునిగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీకి నియోజకవర్గంలో బలం చేకూరినట్లు అయింది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, తన మద్దతుదారులను కలుపుకుబోతూ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గట్టి పోటీని ఇచ్చి రెండు సార్లు ఓటమి పాలైన సత్యనారాయణరావు ఈసారి ఎలాగైనా భూపాలపల్లి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాలనే పట్టుదలతో నియోజకవర్గంలో పర్యటనలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో గట్టి పట్టు సాధిస్తున్న సత్యనారాయణరావు ఈసారైనా ఎమ్మెల్యేగా గెలుపొందేనా అనే చర్చలు కొనసాగుతున్నాయి. రెండుసార్లు ఓటమిపాలయ్యారనే సానుభూతి, మంచి మనసున్న నేతగా పలుకుబడిని సాధించుకున్న సత్యనారాయణ రావును ఎలాగైనా ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఆయన మద్దతుదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ వివిధ కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహిస్తూ రాబోయే ఎన్నికలకు సమయాత్తం అవుతున్నారు.