కాంగ్రెస్ పార్టీలో అంచలంచలుగా ఎదిగిన డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్

కాంగ్రెస్ పార్టీలో అంచలంచలుగా ఎదిగిన డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్

కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తే అసెంబ్లీకైనా పార్లమెంట్ కైనా పోటీకిసై అంటున్న చెవిటి

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన చెవిటి వెంకన్న యాదవ్ వార్డ్ మెంబర్ స్థాయి నుండి అంచలంచలుగా ఎదిగి రెండుసార్లు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా పదవులు నిర్వహించి నేడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష  స్థానంలో ఉన్నారు .కాగా ఈసారి కాంగ్రెస్ పార్టీ రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా చెవిటి వెంకన్న యాదవ్ భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి గాని, లేదా మరేదైనా అసెంబ్లీ స్థానం నుండి గాని ,పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మాజీ మంత్రి ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్ రెడ్డి  దామోదర్ రెడ్డి ప్రధాన అనుచరునిగా గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతూ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చెవిటి వెంకన్న యాదవ్ నేడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి తాను సైతం సిద్ధమని సంకేతాలు పంపిస్తున్నారు.

భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గం ఓట్లు బాగా ఉండడంతో, తనకు కలిసి వచ్చే అంశం అని అందులో భాగంగా ,తాను ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తన  అనుయాయుల వద్ద చెప్తున్నారు. కాగా బిఆర్ఎస్ పార్టీలో యాదవ సామాజిక వర్గం నుండి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ,కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ యాదవ్ లు యాదవ సామాజిక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి బీసీ నాయకులు అంతగా లేకపోవడంతో చెవిటి వెంకన్న యాదవ్ కు ఈసారి ఎంపీగా నైనా, ఎమ్మెల్యేగానైనా స్థానం దొరికే అవకాశం కనిపిస్తోందని పలువురు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు .చెవిటి వెంకన్న యాదవ్  భువనగిరి పార్లమెంట్ నుండి పోటీ చేయాలని, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సూచిస్తున్నట్లు సమాచారం.కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయకుల సమావేశంలో సైతం  ఉమ్మడి జిల్లాలో బీసీలకు రెండు సీట్లు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు, అందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.దామోదర్ రెడ్డి ఆశీస్సు లతో పార్లమెంట్ ఎన్నికల బరిలో లేదా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని చెవిటి వెంకన్న యాదవ్ భావిస్తున్నట్లు సమాచారం. బీసీలలో మంచిపట్టున్న చెవిటి వెంకన్న యాదవ్ కు పోటీ చేసే అవకాశం ఇస్తే పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీలను సంతృప్తి పరిచినట్లు అవుతుందని ఈసారి పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయించే అవకాశం ఉందని, కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు .మరి బీసీల ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి బీసీలకు అవకాశం ఇస్తారో ,లేదో వేచి చూడాల్సిందే.