కేసీఆర్ పాల‌న‌లో కులవృత్తులకు పూర్వ వైభవం

కేసీఆర్ పాల‌న‌లో కులవృత్తులకు పూర్వ వైభవం

బడుగులకు బాసటగా రూ.లక్ష ఆర్థికసాయం: దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,నిర్మ‌ల్: రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల  ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అన్ని కులవృత్తులను ఆదుకున్న కులబాంధవుడని అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్మ‌ల్ లో జ‌రిగిన  సంక్షేమ సంబురాలలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, రైతు భరోసా ద్వారా ఆర్దిక సాయం అందజేస్తోందని వివ‌రించారు. దళితులకు దళిత బంధు అందజేస్తోందన్నారు. కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా నేటి నుంచి కులవృత్తుల  కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. దీన్ని ప్రతి ఒక్క‌రూ వినియోగించుకోవాలని కోరారు. 
గ‌త ప్రభుత్వాలు కంటి తుడుపుగా ఇచ్చిన రెండువందల రూపాయల పింఛన్‌ను ఆసరా కింద రూ. 2,016, దివ్యాంగులకు రూ. 3,016 పెంచారన్నారు. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు,ఫైలేరియా బాధితులకు, డయాలసిస్ రోగులకు సైతం రూ. 2,016 పింఛన్ ఇస్తున్నామన్నారు. 

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పేదలకు వరమన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, అడిషనల్ కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ స్రవంతి, మునిసిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి తదితర అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.