రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి వరంగల్ జిల్లా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ‘శోభకృత్’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు! తెలిపారు. జీవితానికి ప్రతీక ఈ ఉగాది షడ్రుచులు. శిశిరం నుంచి వసంతంలోకి అడుగుపెట్టి, చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా వుండే కాలం. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం.

సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుందని మంత్రి దయాకర్ రావు తెలిపారు.ఈ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను కలుగచేస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా పడి, రాష్ట్రం పాడి పంటలతో, పసిడి కాంతులతో వెలిగిపోవాలని కోరుకున్నారు. సీఎం కెసిఆర్  నేతృత్వంలో తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సంవత్సరం తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు.