ఇండియన్ ఐడల్ లో సత్తా చాటిన సిద్దిపేట ఆడ బిడ్డ

ఇండియన్ ఐడల్ లో సత్తా చాటిన సిద్దిపేట ఆడ బిడ్డ
  • సింగర్ గా తనదైన శైలిలో ప్రదర్శించి రెండవ రన్నర్ గా నిలిచిన లాస్య ప్రియ
  • ట్విట్టర్ ద్వారా లాస్య ప్రియను అభినందించిన మంత్రి హరీష్ రావు
  • ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాదించాలని ఆకాంక్ష వెలుబుచ్చిన తల్లిదండ్రులు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాకు చెందిన గుమ్మన గారి లాస్య ప్రియ ఆహ యాప్ లో జరిగిన ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో రెండవ రన్నర్ గా నిలిచి తన సత్తా చాటుకుంది. మొదటి నుండి పట్టుదలతో తన సంగీత ప్రదర్శన ఇస్తూ ప్రేక్షకులకు అలరింపజేసింది. ప్రోగ్రాం జరుగుతున్న క్రమంలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు లాస్య ప్రియకు ట్విట్టర్ ద్వారా తన ఆశీస్సులతో స్పూర్తినిచ్చారు. దీంతో మరింత బాధ్యతతో, పట్టుదలతో ప్రదర్శన ఇచ్చి లాస్య ప్రియ ఫైనల్ కు చేరి సీజన్ 2 లో రెండవ రన్నర్ గా నిలిచింది. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట- భూంపల్లి మండలం పోతా రెడ్డి పేట గ్రామానికి చెందిన ప్రముఖ అష్టావధాని గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ మనుమరాలు లాస్య ప్రియ. ఆమె తండ్రి గుమ్మన్నగారి వేణుమాధవ శర్మ ఉపాధ్యాయుడు కాగా, తల్లి చంద్రకళ గృహిణి కాగా మరో సోదరుడు విద్యారణ్య శర్మ ఉన్నారు. కుటుంబీకులతో కలిసి హైదరాబాదులోనే ఉంటున్న లాస్య ప్రియ చిన్నతనంలోనే సంగీతంపై మక్కువ పెంచుకుంది.

లలిత సంగీతంలో‌ రామచారి వద్ద శిక్షణ తీసుకుంది. కర్ణాటక సంగీతంలో నిహాల్ వద్ద శిక్షణ తీసుకుంటుంది. శ్రీ‌ వేంకటేశ్వర భక్తి చానల్ లో గీతాంజలి, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాలలో,జెమినీ‌ చానల్ లో బోల్ బేబీ బోల్ కార్యక్రమం లో పాల్గొని ప్రముఖుల ప్రశంసలను పొందింది. హైదరాబాద్ లోని‌‌ సి.ఎం.ఆర్ కళాశాలలో బి.టెక్ పూర్తి చేసి డాటా‌ సైన్స్ ఇంజనీర్‌ గా ప్రస్తుతం పనిచేస్తుంది. ఇండియన్ ఐడల్ వేదికపై ప్రముఖ గాయని చిత్రగారితో కలిసి పాడడం తనజీవితం లో మరిచిపోలేని సంఘటలుగా లాస్య ప్రియ చెప్పారు. మంత్రి హరీష్ రావు తనకు ట్విట్టర్ ద్వారా ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనని ఆమె కొనియాడారు.

లాస్య ప్రియకు ట్విట్టర్ ద్వారా మంత్రి హరీష్ రావు అభినందనలు

ఇండియన్ ఐడల్ తెలుగు -2023 సింగింగ్ కాంపిటీషన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియకు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని మంత్రి తెలిపారు లాస్య ప్రియ తన తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చిన ముద్దుబిడ్డ అని కొనియాడారు.

ఆనందంగా ఉంది.. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష

తల్లిదండ్రులు తమ కూతురు ఇండియన్ ఐడియల్ సెకండ్ రన్నరపుగా నిలవడం పట్ల గుమ్మన్నగారి లాస్య ప్రియ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. లాస్యప్రియకు మరింత ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని భగవంతుని కోరారు. ఆహా యాప్ పాటల పోటీల్లో పాల్గొని రెండు లక్షల రూపాయల ప్రైజ్ మనీ, గోల్డ్ మైక్ ను ట్రోఫీని అందుకోవడం తమ కెంతో ఆనందం ఇచ్చిందన్నారు లాస్య ప్రియా తల్లిదండ్రులు గుమ్మన్నగారి వేణుమాధవ్ శర్మ చంద్రకళ