ప‌దేళ్లు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీయే

ప‌దేళ్లు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీయే
  • పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే  విజయం
  • కార్య‌క‌ర్త‌లంతా క‌లిసి భారీ మెజార్టీతో మ‌ల్లు ర‌విని గెలిపించాలి
  • ఎక్సైజ్, ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

ముద్ర.కొల్లాపూర్:- ప‌దేళ్లు అధికారంలో ఉండేద‌ని కాంగ్రెస్ పార్టీయేన‌ని, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఎక్సైజ్, ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. సోమ‌వారం కొల్లాపూర్ ప‌ట్ట‌ణంలోని ఓ ఫంక్ష‌న్ హాల్ లో నిర్వహించిన అచ్చంపేట్, క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గాల‌ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవ‌ల్ ఏజెంట్లు, బూత్ లెవ‌ల్ క‌మిటీ  స‌భ్యుల ఈ స‌మావేశానికి ముఖ్య అతిధిగా నాగ‌ర్ క‌ర్నూల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ ఇంచార్జ్, మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హాజ‌ర‌య్యారు. అసెంబ్లీ ఎన్నిక‌ల మాదిరిగానే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ పార్టీని అత్య‌ధిక స్థానాల్లో గెలిపించి   తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి బ‌హుమానంగా ఇద్దామని పిలుపునిచ్చారు. సీయం రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు చేసిందని, బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీల ను అమలు చేయలేదన్నారు.

100రోజుల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేసి పేదలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు.మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్... తాను చేసిన త‌ప్పుల‌కు కాంగ్రెస్  ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేస్తున్నారని ద్వ‌జ‌మెత్తారు. మీ అస‌మ‌ర్ద‌త వ‌ల్లే నేడు రాష్ట్రంలో ఇలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయని తెలిపారు.  రాజ‌కీయ ల‌బ్ధి పొందేందుకు  పంటలు ఎండిపోయినాయి అంటూ  జిల్లా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. చేసేదంతా చేసి మొస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని అన్నారు.ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి నుంచి ద‌ళితబంధు వ‌ర‌కు ఇచ్చినా ఏ ఒక్క హామీని నెర‌వేర్చ‌ని ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుందని పేర్కొన్నారు. ద‌క్షిణ తెలంగాణ‌లో  ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టయినా పూర్తి చేశారా..?, ఈ  ప్రాంతానికి కనీసం నీళ్లు ఇవ్వాలన్న ఆలోచనైనా చేశారా?  యువ‌త‌కు ఉద్యోగాలు ఇచ్చారా, ప‌ల్లెల‌ను అభివృద్ధి చేశారా? ఏం చేశార‌ని బీఆర్ఎస్ నాయ‌కులు ఇవాళ ఓట్లు అడుగుతున్నార‌ని ప్ర‌శ్నించారు.  కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర‌ అభివృద్ధి, సంక్షేమం సాధ్య‌మ‌ని అందుకే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామ‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.కేసీఆర్ ను దుర్మార్గుడు అన్న ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఇప్పుడు ఆయ‌న పంచ‌నే చేరాడని, ప్ర‌వీణ్ కుమార్ కు ఓట్లు అడిగే హ‌క్కు లేదన్నారు.కార్యక్రమంలో అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ మంత్రి చిత్త రంజన్ దాస్,నాయకులు జగదీశ్వర్ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.