రైతులను, కూలీలను ఆప్యాయంగా పలుకరించిన మంత్రి  జూప‌ల్లి

రైతులను, కూలీలను ఆప్యాయంగా పలుకరించిన మంత్రి  జూప‌ల్లి

ముద్ర.కొల్లాపూర్ : రాష్ట్ర ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు  కొల్లాపూర్ ప‌ట్ట‌ణ శివారులో  వేరుశ‌న‌గ‌  రైతులు, వ్యవసాయ కూలీలను ఆప్యాయంగా పలకరించారు. వేరుశ‌న‌గ  పంట దిగుబ‌డి, మ‌ద్ధ‌తు ధ‌ర‌, కూలీ రేట్ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. కొల్లాపూర్ ప‌ట్ట‌ణంలోని త‌మ కాల‌నీలో న‌ల్లా నీరు స‌క్ర‌మంగా స‌ర‌ఫ‌రా చేయ‌డం లేద‌ని, కొన్ని రోజులుగా నీరు  రుచి, వాసన  మారిపోయి వస్తుందని మంత్రికి వివ‌రించారు. దీనిపై వెంట‌నే స్పందించిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు  సంబంధిత  అధికారుల‌కు  ఫోన్ చేశారు. నీటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని,  వాట‌ర్ ట్యాంక్ ల‌ను శుభ్ర‌ప‌ర్చాల‌ని ఆదేశించారు. మంత్రి జూప‌ల్లి స్వయంగా తమ సమస్యలను విని పరిష్కరిస్తానని తెలుపడంతో రైతులు, కూలీలు సంతోషం వ్యక్తం చేశారు.

స‌హ‌జ‌సిద్ద‌మైన క‌ల్లునే విక్ర‌యించాలి

రోడ్డుపక్కన క‌ల్లు  విక్ర‌యిస్తున్న గీత కార్మికుడి ద‌గ్గ‌రికి వెళ్లి  మంత్రి జూప‌ల్లి ప‌ల‌క‌రించారు. ఔషధగుణాలు, పోషకాలు, విటమిన్లు కలిగిన కల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని, చెట్టుపై నుంచి తీసే సహజ సిద్ధమైన క‌ల్లునే విక్ర‌యించాల‌ని  గీత కార్మికుడికి సూచించారు. అట్ల కాకుండా ర‌సాయ‌నాలు క‌లిపి క‌ల్తీ కల్లు విక్ర‌యించిన వారిపై  క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు.కార్యక్రమంలో కొల్లాపూర్ మండల, పట్టణ ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు