బియ్యం మాఫియాపై చర్యలకు వెనుకంజ

బియ్యం మాఫియాపై చర్యలకు వెనుకంజ
  • అక్రమ రవాణా అరికట్టేనా..?
  • అధికారుల తీరు ప్రశ్నార్థకం

ముద్ర న్యూస్,కాటారం: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోదావరి పరివాహక ప్రాంతం అక్రమాలకు అడ్డాగా మారింది. జిల్లాలోని కాళేశ్వరం,అన్నారం, మేడిగడ్డ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర వంతెనలు అక్రమ రవాణాకు అనుకూలంగా మారాయి. రోజు పదుల సంఖ్యలో డీసీఎం, బోలేరో వాహనాలలో రేషన్ బియ్యం అక్రమంగా సరిహద్దులు దాటుతున్నా అరికట్టాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రతి నెల 8వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రోజూ వాహనాలలో దర్జాగా పీడీఎస్ బియ్యం సరిహద్దులు దాటుతోంది.

కరోనా కాలం నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం లబ్ధిదారుల కడుపు నింపకపోవడం శోచనీయం. దీనిపై సరిహద్దులో ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు తెలిసిన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయడం పట్ల పలువురు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు.ప్రభుత్వం కోట్లాది రూపాయలు సబ్సిడీలు భరించి ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం పథకం అక్రమార్కులకు,అవినీతి అధికారుల జేబులు నింపుతుండడం విడ్డూరంగా ఉందని పలువురు యువకులు పెదవి విరుస్తున్నారు.గ్రామాలలో బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేయడం సులువైన మార్గం కావడంతో పలువురు ఈ దందా చేయడం కోసం పోటీలు పడుతున్నారు.

మహారాష్ట్ర సరిహద్దులో ఉండి బియ్యం దందా కొనసాగిస్తున్న ప్రధాన వ్యక్తి గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా స్థాయిలో అనుచరులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా యదేచ్ఛగా రవాణా చేస్తున్నారు.ఈ దందాలో మండల స్థాయి అధికారుల నుండి జర్నలిస్టుల వరకు ఎక్కడికి అక్కడ నెలనెలా మామూల్లు ముడుతున్నాయని ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో అధికారులు..జోరుగా బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఏ ప్రాంతంలో అయినా అక్రమ రవాణాలు, దందాలు కొనసాగితే అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం చూస్తున్నాం.కానీ కాటారం సబ్ డివిజన్ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతం గుండా జోరుగా అక్రమ రవాణాలు,దందాలు కొనసాగుతున్నా ఇక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కనిపిస్తోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యంలో 90% పైగా అక్రమంగా రవాణా అవుతుండడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదని పలువురు సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, అక్రమ రవాణా,దందాలను అరికట్టాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.