ద్రోహం చేసిన కుటుంబానికి కాంగ్రెస్ టికెట్...

ద్రోహం చేసిన కుటుంబానికి కాంగ్రెస్ టికెట్...
  • అభివృద్ధి చేస్తే అగౌరవం... ఉదయపూర్ డిక్లరేషన్ ఏమైంది..
  • కార్యకర్తల అభిప్రాయమే నా నిర్ణయం మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నిరంతరం కాంగ్రెస్ పార్టీని ఓడించడమే కాకుండా శాసనమండలిని అధికార పార్టీలో విలీనం చేసిన నేర చరిత్ర కలిగిన దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం దారుణమని పార్టీ అభివృద్ధికి పటిష్టతకు తాను పార్టీలో చేరినాటి నుండి పనిచేసిన తనకు టికెట్ కేటాయించకపోవడంపై టీపీసీసీ అధ్యక్షులు రాష్ట్ర నేతలు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి నేటి వరకు పార్టీ అభివృద్ధి కోసం ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ ఇచ్చిన పిలుపులను విజయవంతం చేయడంతో పాటు పార్టీ బహిరంగ సభలను రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేసేందుకు వేలాది మందిని ఈ ప్రాంతం నుండి తరలించిన తనను కాదని నియోజకవర్గ ఎల్లలు తెలియని వ్యక్తికి పార్టీ ఎలా టికెట్ కేటాయిస్తుందని ప్రశ్నించారు.

టికెట్ కేటాయింపులో ఉదయపూర్ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదని మూడు పర్యాయాలు వరుసగా ఓడిపోయిన నేతకు టికెట్ ఇవ్వరాదని ఐదు సంవత్సరాలు పార్టీ అభివృద్ధి కోసం పనిచేయని నేతకు టికెట్ ఇవ్వరాదని తీర్మానం చేయడం జరిగిందని వాటిని తుంగలో తొక్కి సర్వేల పేరుతో రాష్ట్ర నాయకత్వం టిక్కెట్టు కేటాయించడం సరికాదన్నారు. తాను కష్టపడితే ఇతరులకు టికెట్ ఎలా కేటాయిస్తారని వారికి ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించారు సర్వే పేరుతో తనకు నమ్మకద్రోహం చేశారని ఎక్కడ సర్వే చేశారో స్పష్టం చేయాలని నిలదీశారు. తాను ఎప్పుడు సొంత నిర్ణయం తీసుకోలేదని రాజకీయాలను కార్యకర్తల అభిప్రాయం మేరకే పని చేస్తానని నామినేషన్ గడువులోపు తన వైఖరిని స్పష్టం చేస్తానని తెలిపారు. టికెట్ కేటాయింపులో తనకు జరిగిన నమ్మకద్రోహం పై జాతీయ పార్టీ దృష్టి సారించాలని తనను బుజ్జగించేందుకు వచ్చిన మాణిక్యం ఠాక్రే జానారెడ్డి చిన్నారెడ్డి లాంటి నాయకులకు తాను వివరించడం జరిగిందని తెలిపారు తనను రాజీ అడిగే హక్కు పార్టీ నేతలకు లేదని అన్నారు అన్నారు ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి వివిధ మండలాల అధ్యక్షులు కోటయ్య లక్ష్మయ్య మిద్దె రాములు అర్జునయ్య పాండు నిజాం సత్యం భీముడు అహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు