ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి జూపల్లి

ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి జూపల్లి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:  కొల్లాపూర్, డిసెంబ‌ర్ 30: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావ‌స్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శ‌నివారం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్ పట్టణంలో ప్ర‌జా పాల‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.  సంబంధిత  అభయహస్తం పథకాల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారులకు అధికారులు విధిగా సమగ్ర వివరాలు చదివి వినిపించి, ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని పూరించాలన్నారు. దరఖాస్తులను అందుబాటులో ఉంచాల‌ని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో అధికారుల‌తో పాటు ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని సూచించారు. దరఖాస్తుదారులకు తాగునీరు, టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు  స్పష్టం చేశారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని వర్గాలు సంఘటితమై ఉద్యమించడం వల్ల,  ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు, కలలు నెరవేరాలని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని, అణిచివేత దౌర్జన్యం ఉండొద్దని తెలంగాణను సాధించుకున్నాం అని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ఆ లక్ష్యం నెరవేరని కారణంగా 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియా  గాంధీ సేవలను గుర్తించి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారం కట్టబెట్టారని చెప్పారు. 

సీఎం రేవంత్ రెడ్డి సారాధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం  ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రజా పాలన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అర్హులకు ప్రభుత్వ పథకాలను అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి పథకం లబ్ధిదారునికి చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 

ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడితే స‌హించేది లేదు: మంత్రి జూపల్లి

ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకే ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఉన్నార‌ని, కానీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం త‌మ్ వ‌ద్ద‌కు వ‌చ్చే సామాన్యుల‌ను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేద‌ని మంత్రి జూప‌ల్లి స్ప‌ష్టం చేశారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని రెవెన్యూ అధికారుల ద‌గ్గ‌రికి పోతే లంచం డిమాండ్ చేశార‌ని, ఇప్ప‌టికే కొన్ని డ‌బ్బులు కూడా ముట్ట‌జెప్పాన‌ని ఓ మ‌హిళ మంత్రి దృష్టికి తెచ్చారు.  దీనిపై వెంట‌నే స్పందించిన మంత్రి... లిఖితపూర్వ‌క ఫిర్యాదు చేయాల‌ని, ఆధారాలు స‌మ‌ర్పిస్తే... విచార‌ణ జ‌రిపి సంబంధిత అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. నాయ‌కులు, అధికారులు ఎవ‌రైనా స‌రే ప్ర‌జ‌లను ఇబ్బందులు పెడితే స‌హించేది లేద‌ని మంత్రి జూప‌ల్లి హెచ్చ‌రించారు.