ముఖ్యమంత్రికి మహారాష్ట్రకు వెళ్లే సమయం ఉంది..

ముఖ్యమంత్రికి మహారాష్ట్రకు వెళ్లే సమయం ఉంది..

నిరుద్యోగ సమస్యలపై మాట్లాడే సమయం లేదా?
ప్రజల సొమ్ముతో తిరుగుతూ,ప్రజలను పట్టించుకోవడం లేదు.
ఏ ముఖం పెట్టుకొని అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చేస్తారు..
డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ...

నాగర్ కర్నూల్ జిల్లా ముద్ర ప్రతినిధి :తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పార్టీ కార్యక్రమాలపై దేశమంతా తిరిగి మీటింగ్ లు పెడుతున్నారు కానీ రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులు పడుతున్న బాధల గురించి ఎందుకు మాట్లాడడం లేదని డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. పేద ప్రజల సొమ్ముతో ఎసి ఇళ్లలో ఉంటూ,ఎసి కార్లలో తిరుగుతూ పేద ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ భవన్ కు వెళ్లి,మహారాష్ట్ర నాయకులతో మాట్లాడే సిఎం,అక్కడే మీడియా ముందుకు వచ్చి నిరుద్యోగుల గురించి మాట్లాడచ్చు కదా అని అన్నారు. ముఖ్యమంత్రికి నిరుద్యోగ యువత, పేద ప్రజలపై ప్రేమ లేదన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత 9 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో ఎస్సీ,ఎస్టి,బిసి,మైనారిటీల వాటా ఏదని ప్రశ్నించారు.అట్టడుగు ప్రజలను అణిచివేస్తూ, ఏ ముఖం పెట్టుకోని అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరిస్తారని మండిపడ్డారు.పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీకేజీ కేసులో కేవలం బోర్డు సభ్యులను విచారించినంత మాత్రాన,అసలైన దొంగలు బయట పడతారని, నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని అన్నారు. వెంటనే బోర్డు చైర్మెణ్ ను అదుపులోకి తీసుకొని విచారించాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు భావ సారూప్యత ఉన్న పార్టీలను కలుపుకొని పోరాటం చేస్తామని హెచ్చరించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం,మండలంలో జరిగిన  బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా 207 వ రోజు పలు గ్రామాల్లో పర్యటించారు. పేద ప్రజలకు కనీసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా దొరలు మాత్రం 40 రూములున్న ఫాంహౌస్ ల్లో ఉంటున్నారని, కూలీ పని చేసుకుని పేదలు బతుకుతుంటే పాలకులు స్కాంలు చేసి 20 లక్షల గడియారం పెట్టుకుంటున్నారని ఆరోపించారు.

ఓట్లేసి ప్రజలు తరతరాలుగా పేదరికంలో ఉంటే,పాలకులు మాత్రం కేవలం ఓట్లపుడు డబ్బు,మద్యం పంచి,వారి వారసులను కూడా రాజకీయాల్లోకి తెస్తున్నారని తెలిపారు. మనం ఆత్మగౌరవంతో బతకడం ఈ దోపిడీ పాలకులకు నచ్చదని,అందుకే మన జెండా గద్దెలు,మహనీయుల విగ్రహాలు కట్టకుండా అడ్డుకుంటారని పేర్కొన్నారు. అందుకే మనం ఆత్మగౌరవంతో బతకాలంటే,మన పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలంటే,ఆత్మగౌరవంతో బతకాలంటే ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. యాత్ర తూడుకుర్తి,శ్రీపురం ,పెద్దాపూర్,గుడిపల్లి,గున్యాగుల,పెద్దముద్దునూర్,చందుబట్ల,వనపట్ల,మంతటి,ఎండబెట్ల, తదితర గ్రామాల్లో పర్యటించారు. యాత్రలో జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి కుమార్,జిల్లా ఇంచార్జి అంతటి నాగన్న,జిల్లా కార్యదర్శి రాంచందర్,నియోజకవర్గ అధ్యక్షులు పృధ్విరాజ్,మహిళా నాయకురాలు కత్తుల పద్మ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..