బిగ్ బ్రేకింగ్...! ఎంపీ రాములుకు అవమానం...?

బిగ్ బ్రేకింగ్...! ఎంపీ రాములుకు అవమానం...?
  • పార్లమెంటరీ సమావేశాలకు అందని ఆహ్వానం
  • పొమ్మనలేక...పొగబెట్టడమేనా
  • నేటి కేటీఆర్‌ సమీక్షకు రాములు గైర్హాజరు
  • సిట్టింగ్‌స్థానం కైవసమేలంటూ అనుచరుల ధ్వజం
     

ముద్ర ప్రతినిధి నాగర్‌కర్నూల్‌ :పార్లమెంట్‌ సభ్యులు పోతుగంటి రాములుకు బీఆర్‌ఎస్‌ పార్టీ అవమానిస్తోందా..., పొమ్మనలేక పొగబెడుతోందా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. సుదీర్ద రాజకీయ అనుభవం గల నాయకుడిగా, మాజీ మంత్రిగా, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ ఉన్న రాములును బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం చేస్తోందనే అభిమానుల అనుమానాలకు తాజా పరిస్థితులు అద్దంపడుతున్నాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా నిర్వహించే పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశాలకు రాములుకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. ఆదివారం అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాల సమావేశాలకు రాములు దూరమయ్యారు. రాములు పట్ల పార్టీ గతంలో నుంచీ అవమానాలు ఎదురవుతున్నాయన్నాయని అనుచరులు ఆవేదన చెందుతున్నారు.

రాములు తనయుడు, జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుగంటి భరత్‌కు జెడ్పీ ఛైర్మన్‌ పదవి విషయంలో విభేదాలు తలెత్తాయి. గతంలో జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేల వల్లే తనయుడికి జెడ్పీ పీఠం దక్కలేదనే అనుమానాలు రాములు,ఆయన వర్గీయుల్లో నెలకొన్నాయి. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో బహిరంగంగా వివాదం తెలిసిందే. కాగా రాములు ఆది నుంచీ మృదు స్వభావం గల వ్యక్తి కాగా, భరత్‌ది దూకుడు స్వభావం. దీంతో తండ్రీతనయులను ఆయా మనస్తత్వ స్వభావాలున్న అనుచరులూ అభిమానిస్తూ వస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ పట్ల రాములు విధేయుడిగానే ఉంటూ తనయుడిని రాజకీయ వివాదాలకు దూరంగా ఉంచుతూ వచ్చారు. దీంతో గత ఏడాదికిపైగా భరత్‌ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఫలితంగా వివాదం సద్దుమణిగిందని భావిస్తూ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్హాపూర్‌ ఇంఛార్జ్‌గా రాములు బీఆర్‌ఎస్‌ గెలుపుగై పని చేశారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంలోకి మారడంతో, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే ముందుకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.

కాంగ్రెస్‌ నుంచి ఆశావహుల సంఖ్య అధికంగానూ ఉంది. అయినా పార్టీ రాష్ట్ర కార్యక్రమాల్లో, రాష్ట్ర నాయకుల పర్యటనల్లో పాల్గొంటూ వస్తున్నా రాములుకు సొంత ఇలాఖాలోనే అవమానం జరిగిందని అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన రాములుకు సొంత నియోజకవర్గంతో పాటుగా నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీలోనూ కేటీఆర్‌ సమక్షంలో జరిగే సమావేశాలకు ఆహ్వానం అందకపోవడం పొమ్మనలేక పొగబెట్టడమేనా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. ఎంపీగా ఉంటూ ప్రతి ఒక్కరినీ ప్రేమతో పలకరించే రాములుకు ఎస్సీ సామాజిక వర్గం అండ బలంగా ఉంది. అదేగాకుండా పార్లమెంటరీ పరిధిలోనూ సత్సంబంధాలు నెలకొన్నాయి. కాగా బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాన్ని కైవసం చేసుకునే వ్యూహాల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ రాములుకు ఆహ్వానం అందించకపోవడంపై టిక్కెట్‌ ఇవ్వమనే సందేహాలను పరోక్షంగా అందిస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ పరిణామాలు బీఆర్‌ఎస్‌లో రాములు వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తిని కలగిస్తుండగా కాంగ్రెస్‌, బీజేపీల్లో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.