ఏబుల్ లీడర్ సీఎం కెసిఆర్

ఏబుల్ లీడర్ సీఎం కెసిఆర్
  • ఇతర పార్టీలకు ఓటు వేయడం రిస్క్
  • మంత్రి హరీష్ రావు
  • మెదక్ లో పద్మ నామినేషన్ లో పాల్గొన్న మంత్రి

ముద్ర మెదక్:- సీఎం కెసిఆర్ ఉండగా ఇతర పార్టీలకు ఓటు వేసి ఎందుకు రిస్క్ తీసుకోవాలని  ప్రజలు  ఆలోచిస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం మెదక్ లో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో ఆలోచిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ, నేడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ తరహాలో అమలుకావడం లేదన్నారు. ఆసరా పెన్షన్ పెంచాలన్న రైతుబంధు పెంచాలన్న, కళ్యాణ లక్ష్మి కావాలన్నా,  ప్రజలకు మేము ఇవ్వగలుగుతాం కానీ బిజెపి, కాంగ్రెస్ లు ఢిల్లీకి పోవాలని ఎద్దేవా చేశారు. ఆసరా పెన్షన్ పెంచాలన్న ఢిల్లీ నాయకులు అనుమతిస్తే పెంచే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. టికెట్ కావాలన్నా, ప్రచారం కావాలన్నా ఢిల్లీ నాయకులు రావాలన్నారు.  రేపు పదవులు కావాలన్న ఢిల్లీకి వెళ్లాల్సిందేనన్నారు. ప్రజలు  ఢిల్లీ వెళ్లి అడిగే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. 

ఢిల్లీ పార్టీలను నమ్ముకొని మోసపోవాల్సిన అవసరం లేదని ప్రజలకు పిలుపునిచ్చారు. టికెట్లు ఇవ్వడానికి ఆగమాగం అయిపోతున్నారు.అర్రాస్ పాట పాడినట్లు టికెట్లు తక్కట్లో పెట్టి అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారని గుర్తు చేశారు. విరు రాష్ట్రాన్ని పరిపాలిస్తారా..? వీరి చేతిలో రాష్ట్రం పెడితే కుక్కలు చింపిన ఇస్తరాకు అవుతుంది.. రాష్ట్రo అధోగతి అవుతుందన్నారు. ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్ కెసిఆర్ చేతుల్లో ఈ రాష్ట్రం ఉండటమే సబబు అన్నారు. పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎంత సురక్షితంగా ఉంటుందో  ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తెలంగాణ సాధించిన కెసిఆర్ చేతిలోనే ఉంటే బాగుంటుందన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోగలుగుతుందని తెలిపారు. కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.. మెదక్ లో పద్మ,  రాష్ట్రంలో కెసిఆర్ గెలుపును ఎవరు ఆపలేరని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. మెదక్ లో పద్మాదేవేందర్ రెడ్డి సీనియర్ నాయకురాలు, 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, రామయంపేట జడ్పిటిసిగా 2001లో గెలిచి 2023వ సంవత్సరంలో దాదాపు 22 సంవత్సరాలు పార్టీకి, ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు.  ఉద్యమంలో నిరాహార దీక్షలో, రైల్వే రోకోలోఉన్నారు, మహిళా అయ్యుండీ కూడాఎన్నో అరెస్టుల్లో ఉన్నారన్నారు. అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకురాలు, తెలంగాణ శాసనసభలో  మెదక్ ప్రజల కష్టాలను వాణి,  బాణి వినిపించిన నాయకురాలన్నారు. 

ఘణపుర్  ఆనకట్ట నీటి విడుదల కోసం పోరాటo చేసింది, ఉద్యమంలో ఉన్నప్పుడు మెదక్ అభివృద్ధి కోసం పోరాటం చేశారన్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా అద్భుతంగా శాసనసభ సమావేశలు నిర్వహించారన్నారు. మెదక్ మీద సంపూర్ణమైన అవగాహన ఉంది, గ్రామాల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిని గెలిపిస్తే  రాబోయే రోజుల్లో మెదక్ ను పరుగులు పెట్టించొచ్చన్నారు. కొంతమంది తెలిసి తెలియక అభివృద్ధి అంటే అర్థం తెలియని వాళ్ళు అభివృద్ధి జరగలేని పద్మాదేవేందర్ రెడ్డిని విమర్శిస్తున్నారు.అసలు అభివృద్ధి అంటే అర్థం తెలుసా వారికి అని ప్రశ్నించారు. అభివృద్ధి ఎలా చేయాలో కనీస పరిజ్ఞానం అవగాహన లేని వ్యక్తులు మెదక్ లో మాట్లాడుతున్నారు.  రాష్ట్రం కెసిఆర్ చేతిలో,  మెదక్ పద్మాదేవేందర్ రెడ్డి చేతిలో  ఉండాలాన్నారు. 

మెదక్ అభివృద్ధి జరగాలన్న తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగాలన్న. రెండు చోట్ల కారు గుర్తుకు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. 
మెదక్ ఖిలపై గులాబీ జెండా ఎగరేయాలన్నారు.  అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, పార్టీ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి. పట్టణ మండల అధ్యక్షులు గంగాధర, అంజాగౌడ్ ఉన్నారు. అంతకుముందు పద్మాదేవేందర్ రెడ్డి తరఫున మున్సిపల్ కౌన్సిలర్ శంషున్నిసా బేగం ప్రతిపాదించగా కౌన్సిలర్లు రాగి వనజ, జయశ్రీ జెడ్పిటిసిలు షర్మిలారెడ్డి సుజాతలు నామినేషన్  రిటర్నింగ్ అధికారి అంబదాస్ రాజేశ్వర్ కు సమర్పించారు.