ములుగు ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తా..

ములుగు ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తా..

ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరేలా కృషి: మంత్రి సీతక్క..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి(ములుగు): ములుగు ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ పేదప్రజలకు అందేలా కృషి చేస్తానని పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలోని స్వగ్రామమైన జగ్గన్నపేట గ్రామానికి శుక్రవారం మంత్రి హోదాలో మొదటిసారిగా మంత్రి సీతక్క రాగా గ్రామస్థులు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ మీ ఆడ బిడ్డను నేను, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను, నేను పుట్టిన ఈ గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసే బాధ్యత నాపైన ఉందని అన్నారు.

ప్రజలు నాపైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ములుగు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ లను అమలు చేస్తామని ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోవాలని, అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానని అన్నారు.  అంతకుముందు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలు, పూలమాలలతో మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుచన రవళిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సూర్య,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగ కల్యాణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నునేటి శ్యామ్, ఉప సర్పంచ్ సదానందం, అర్రెం వెంకన్న తో పాటు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.