వరదలు మిగిల్చిన గాయాలు..

వరదలు మిగిల్చిన గాయాలు..
  • ధ్వంసమైన రోడ్లు.. తెగిపోయిన చెరువు కట్టలు..
  • వాగులో గల్లంతైన వారికోసం డ్రోన్ కెమెరాతో వెతుకులాట..
  • లభ్యమైన రెండు మృతదేహాలు..
  • కొనసాగుతున్న సహాయక చర్యలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలతో వరదలు ఏరులై పారి గాయాలు మిగిల్చాయి. అనేక మండలాల్లో రోడ్లు ధ్వంసం అయ్యాయి. చెరువు కట్టలు తెగిపోయాయి. ఎస్సారెస్పీ డిబిఎం -38 కాల్వకు గండి పడింది. ఉగ్రరూపం దాల్చిన వాగులు, పొంగిపొర్లిన వరదలతో జిల్లా అతలాకుతలం అయింది. వరదలో చిక్కుకుపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మొరంచపల్లి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.

ధ్వంసమైన రోడ్లతో రాకపోకలకు ఇబ్బందులు..

వరదల తాకిడికి సుబ్బక్కపల్లి నుండి టేకుమట్ల మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమై వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చిట్యాల మండలం జూకల్, గుంటూరుపల్లి గ్రామాల మధ్యలో ఎస్సారెస్పీ డిబిఎం 38 కాలువకు గండిపడి నీళ్లన్నీ పంట చేనుల మీదుగా ముచినిపర్తి చెరువులోకి వెళ్లాయి. ఎస్ ఆర్ ఎస్ పి కాల్వకు గండిపడడం కారణంగా ఈ ప్రాంతంలో పంట పొలాలన్నీ ధ్వంసం అయ్యాయి. టేకుమట్ల రాఘవరెడ్డి పేట గ్రామాల మధ్యలో గల హై లెవెల్ వంతెన వరద ప్రవాహానికి కుంగిపోయి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక మండలాల్లో చెరువుల్లో నీటి సామర్థ్యం పెరిగి కట్టలకు గండ్లు పడ్డాయి. పంటలు, నార్లు పనికిరాకుండా పోయాయి. 

గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు..

 జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మోరంచ వాగులో గల్లంతైన వారికోసం పోలీసులు శనివారం డ్రోన్ కెమెరాతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో చిట్యాల మండలం పాశిగడ్డతండా శివారులో ఒక వృద్ధుని మృతదేహం, సోలిపేట తాటి వనం శివారు లో ఒక మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. మరికొన్ని మృతదేహాల కోసం పోలీసులు వాగు వెంట ఉన్న గ్రామాల ప్రజల సహాయ సహకారాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మోరంచవాగు ఉధృతికి మూగ జీవాలు కూడా అనేకం కొట్టుకుపోయి మృతి చెంది కనిపించడం హృదయ విదారకంగా మారింది. 

కొనసాగుతున్న సహాయక చర్యలు..

 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు శనివారం మోరంచపల్లి గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ్య పనులను చేయిస్తున్నారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపడుతూ బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు.