రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

బెంగుళూరు: మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు కేసులో ప్రధాన నిందితుడు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌తో పాటు అతని సహ కుట్రదారుడు అబ్దుల్ మతీన్ తాహాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం అదుపులోకి తీసుకుంది. వీరిద్దరినీ కోల్ కతాలో అరెస్టు చేసినట్టు సమచారం. నిందితుల అరెస్టుతో ఈ కేసులో ఎన్ఐఎ కీలక పురోగతిని సాధించినట్టే. ఈ బాంబు పేలుడు తర్వాత నిందితులను పట్టుకోడానికి ఎన్ఐఎ ఎంతగానో ప్రయత్నించింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ప్రధాన నిందితుడి ఊహాచిత్రాలను కూడా విడుదల చేసింది. గత నెల ఒకటో తేదీన బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది వ్యక్తులు గాయపడ్డారు. మాస్క్, టోపీ ధరించి కేఫ్ లోకి వచ్చిన ఒక యువకుడు తనతో పాటు తీసుకొచ్చిన ఒక బ్యాగ్ ను అక్కడే వదిలి వెళ్లినట్టుగా సీసీటీవీ లో రికార్డయ్యింది. పేలుడు తీవ్రత తక్కువగా ఉండే ఐఈడీ వినియోగించడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ పేలుడు తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ, బెంగుళూరు నేర విచారణ బృందం పోలీసులు నిందితుల కోసం వెతుకుతూనే ఉన్నారు. ప్రధాన నిందితుడిని పట్టించిన వారికి రివార్డును కూడా ప్రకటించారు. ఎట్టకేలకు ఎన్ఐఎ కీలక నిందితులను అరెస్టు చేసింది.