ప్యాకేజ్డ్ కొబ్బరి నీళ్లు తాగి 15 మంది ఆస్పత్రి పాలు

ప్యాకేజ్డ్ కొబ్బరి నీళ్లు తాగి 15 మంది ఆస్పత్రి పాలు
  • కర్నాటకలో ఘటన 
  • ఫ్యాక్టరీని సీజ్ చేసిన అధికారులు

మంగుళూరు: కర్నాటక రాష్ట్రం మంగుళూరు జిల్లా అడయారు లో ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు తాగిన 15 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి సహా 15 మంది ఒకే కర్మాగారం నుంచి వచ్చిన ప్యాకేజ్డ్ కొబ్బరి నీళ్లు తాగినట్టుగా వైద్య అధికారులు చెబుతున్నారు. వారంతా వాంతులు చేసుకోవడంతో పాటు డీహైడ్రేషన్ కు గురయ్యారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ తిమ్మయ్య మాట్లాడుతూ కొబ్బరి నీళ్లు తాగి అస్వస్థతకు గురైన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ ఫ్యాక్టరీని తనిఖీ చేసిన వైద్యశాఖ, ఆహార పదార్థాల తనిఖీ అధికారులు అక్కడ మరో 15 లీటర్ల వివిధ సైజుల సాచెట్లలోని కొబ్బరినీటిని సీజ్ చేశారు. వీటిని బెంగుళూరులోని ప్రయోగశాలకు పంపించారు. ప్రయోగశాలలో పరీక్ష ఫలితాల అనంతరమే, ఆయా వ్యక్తులు ఎందుకు అస్వస్థతకు గురయ్యారన్నది తెలుస్తుందని జిల్లా వైద్యాధికారి తెలిపారు. అయితే, ఆయా సాచెట్లపై ఆగస్టు, సెప్టెంబరు తేదీల వరకు వినియోగానికి అనువైనదిగా ఉండడం గమనార్హం. అయితే, అడయారులో కలరా ప్రబలిందని పుకార్లు షికారు చేశాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందిస్తూ, ఇది తాగునీటి వల్ల కానీ, కలరా కానీ కాదని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. కొబ్బరి నీళ్లతో పాటు ఈ ఫ్యాక్టరీ ఐస్ క్రీమ్ లు కూడా తయారు చేస్తుంది. ఫ్యాక్టరీని మొత్తం శుభ్రపరిచామని, అక్కడ వున్న నిల్వ సరుకంతా సీజ్ చేశామని మంత్రి వెల్లడించారు. చికిత్స పొందుతున్న వారు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యేదాకా ఆయా ప్రైవేటు ఆస్పత్రుల వారితో సమన్వయంతో వ్యవహరించి పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.