స్కూలు బస్సు ప్రమాదంపై నలుగురు సభ్యుల కమిటీ విచారణ

స్కూలు బస్సు ప్రమాదంపై నలుగురు సభ్యుల కమిటీ విచారణ

హర్యానా: హర్యానా రాష్ట్రంలోని మహేంద్రగఢ్ లో గురువారం జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంపై విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా, 20 మంది వరకు విద్యార్థులు గాయపడిన విషయం విదితమే. దాదాపు 40 మంది విద్యార్థులతో జిఎల్ పబ్లిక్ స్కూలుకు వెళ్తున్న బస్సు ఉన్హాని గ్రామానికి సమీపంలో ఒక చెట్టును ఢీకొని పల్టీ కొట్టింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దుర్ఘటన అనంతరం హర్యానా విద్యాశాఖ అధికారులు పాఠశాల బస్సుల భద్రతపై చర్చించి తగు చర్యలు తీసుకునేందుకు గాను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, ప్రాథమిక విద్యాధికారులు, బ్లాక్ విద్యాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ ధర్మేందర్ మద్యం మత్తులో వున్నాడని, నిర్లక్ష్యంగా బస్సును నడుపుతూ కంట్రోల్ తప్పాడని సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి ఆ పాఠశాల ప్రిన్సిపాల్, మరో ఉద్యోగి సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రదాని నరేంద్ర మోదీ సహా పలువురు నాయకులు తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.