చంద్రయాన్​–3 ల్యాండింగే చివరి అంకం

చంద్రయాన్​–3 ల్యాండింగే చివరి అంకం
  • అధిగమించి భారత కీర్తిపతాకాలు ఎగురవేస్తామన్న శాస్ర్తవేత్తలు

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–-3 మరో రెండు రోజుల్లో చంద్రుడిపై ల్యాండ్ కానుంది. ఇప్పటికే ల్యాండర్ కక్ష్యను రెండుసార్లు విజయవంతంగా తగ్గించిన ఇస్రో  చంద్రయాన్-–3 పంపిన మరిన్ని చంద్రుడి చిత్రాలను విడుదల చేసింది. ల్యాండింగ్​విషయంలో ఎలాంటి ప్రదేశమైతే అనుకూలం అనే అంశాలపై ఇస్రో పరిశోధన చేసింది. దానికి సంబంధించిన ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోల్లో లోయల మాదిరిగా ఉన్న బిలాలు, మైదాన, కొండ ప్రాంతాల మాదిరిగా కనిపిస్తున్నాయి. విక్రమ్ ల్యాండర్ సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చంద్రుడి అత్యంత సమీపానికి చేరుకున్నట్లు ఇస్రో స్పష్టం చేసింది. 

ఇన్నిరోజులు ఒక ఎత్తు అయితే డీబూస్టింగ్, ల్యాండింగ్​లు మరో ఎత్తని, కత్తిమీద సాములాంటివని శాస్ర్తవేత్తలు తెలిపారు. డీబూస్టింగ్​ చేపట్టేటప్పుడు వాహక నౌక కక్ష్య నుంచి తప్పుకోకుండా క్రమేణా వేగం తగ్గించగలిగామన్నారు. రెండోసారి కూడా డీ బూస్టింగ్​ ప్రక్రియ విజయవంతంగా పూర్తవడంతో ఇక చివరి అంకం ల్యాండింగ్​ మాత్రమే మిగిలి ఉందన్నారు. దీన్ని కూడా అధిగమించి ప్రపంచంలో చంద్రునిపై రోవర్​పంపిన నాలుగో దేశంగా భారత్​కీర్తిని విస్తరింపచేస్తామన్నారు.