క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే లే-అవుట్ల కు అనుమతులు ఇవ్వాలి: కలెక్టర్ 

క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే లే-అవుట్ల కు అనుమతులు ఇవ్వాలి: కలెక్టర్ 
Permissions for layouts should be given only after field inspection

ఖమ్మం, ముద్ర: లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఖమ్మం నగరపాలక సంస్థలో నిర్వహించిన జిల్లా స్థాయి లే అవుట్‌ అప్రూవల్‌ కమిటీ సమావేశంలో నగరపాలక సంస్థ, సుడా పరిధిలో లే-అవుట్‌ ఆమోదం కొరకై అందిన (22) దరఖాస్తులను కమిటీ సమావేశంలో పరిశీలించారు.  నిబంధనల మేరకు సమర్పించబడిన దరఖాస్తులను కమిటీ ఆమోదం తెలిపింది.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో లే-అవుట్ల ఆమోదం కొరకు రెవెన్యూ, విద్యుత్‌, నీటి పారుదల, రోడ్లు భవనాల, టౌన్‌ ప్లానింగ్‌ తదితర అనుబంధ శాఖల నుండి అనుమతులకై సమర్పించిన దరఖాస్తులను 21 రోజుల లోపు ఆయా శాఖలకు సంబంధించిన అనుమతులను జారీచేయాలని, తదనుగుణంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరుగుతుందన్నారు. 

గ్రీనరీ కొరకు కేటాయించిన స్థలాన్ని వెంటనే స్వాధీనపర్చుకొని మొక్కలు నాటాలన్నారు. అనుమతులు జారీకి సంబంధిత శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పిదపనే అనుమతులు జారీచేయాలని కలెక్టర్‌ సూచించారు.  లే అవుట్‌ డెవలపర్స్‌ కూడా నిబంధనల మేరకు చట్టబద్దంగా సమగ్ర ప్రణాళికబద్దంగా ల్యాండ్‌ డెవలప్మెంట్‌ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత , శిక్షణ కలెక్టర్‌ రాధిక గుప్తా, ఇరిగేషన్‌ సి. ఇ. శంకర్‌ నాయక్‌, రెవిన్యూ డివిజనల్‌ అధికారి రవీంద్రనాధ్‌, జెడ్పి సిఇఓ అప్పారావు,  పంచాయితీ రాజ్‌ ఇఇ శ్రీనివాస్, మధిర మునిసిపల్‌ కమీషనర్‌ రమాదేవి, తహశీల్దార్లు , అధికారులు పాల్గొన్నారు.