పోలింగ్ ప్రక్రియ, ఇ.వి.ఎం. యంత్రాల పనితీరుపై పూర్తి అవగాహన కలిగి వుండాలి

పోలింగ్ ప్రక్రియ, ఇ.వి.ఎం. యంత్రాల పనితీరుపై పూర్తి అవగాహన కలిగి వుండాలి
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే 

ముద్ర ప్రతినిధి భువనగిరి :పోలింగ్ ప్రక్రియ, ఇ.వి.ఎం. యంత్రాల పనితీరుపై పూర్తి అవగాహన కలిగి వుండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే  ప్రిసైడింగ్, అసిస్టెంట్  ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు.మంగళవారం భువనగిరి పట్టణంలోని వెన్నెల కాలేజీలో భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి ప్రిసైడింగ్, అసిస్టెంట్  ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధానంపై జరిగే రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు గాను 1005 ప్రిసైడింగ్ అధికారులకు, 1005 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పిఓ, ఎపిఓ అధికారుల పాత్ర కీలకమని, పోలింగ్ రోజు నిర్వహించే విధుల పట్ల, ఇవిఎం యంత్రాల పట్ల పూర్తి అవగాహన పొందాలని తెలిపారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వి.వి. ప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడం, మాక్ పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశాన్ని తెలుసుకొని ఉండాలని,  ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ లో సూచించిన విధంగా మొత్తం పోలింగ్ సామాగ్రిని సేకరించుకోవాలని, ఫారములు, కవర్స్, మెటీరియల్స్, మాక్ పోల్ సర్టిఫికెట్ ఇచ్చే విధానంపై, ఇవిఎం యంత్రాలలో క్లోజ్, రిజల్టు, క్లియర్ వ్యవస్థలపై, వీవీప్యాట్ లో 7 సెకన్లలో వచ్చే స్లిప్స్ పై,  పోల్ జరిగే సందర్భంలో కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్లలో ట్రబుల్ షూట్స్ పై అవగాహన పొందాలని,  మాక్ పోల్ సందర్భంగా కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్లలో ఏదైనా పనిచేయకపోయినా దానిని మాత్రమే మార్చాలని, పోలింగ్ జరిగే సందర్భంలో మాత్రం ఏది పనిచేయకపోయినా అన్నింటిని మార్చాలని, ఈ సందర్భంగా మాక్  పోల్ తిరిగి నిర్వహించాలి, కానీ ఒక్కొక్క అభ్యర్థికి ఒక ఓటును మాత్రమే వేయించాలని తెలిపారు. పోలింగుకు  90 నిమిషాల ముందు మాక్ పోల్ నిర్వహించాలని, మాక్ పోల్ సమయంలో కనీసం 50 ఓట్లు వేయాలని,  నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఓటింగు గోప్యత నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని,  బ్యాలెట్ గోప్యతను కాపాడే విధంగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.  

పోలింగ్ స్టేషన్ ప్రాంతం,  ఓటర్ల వివరాలు తెలిపే నోటీసు బోర్డులు, ఫారం -7 లో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాని పోలింగ్ స్టేషన్ బయట ప్రదర్శించాలని, ఓటర్లకు అవసరమైన సహాయం అందించడానికి బూత్ లెవల్  ఆఫీసర్ల ద్వారా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ సందర్భంలో వచ్చే టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు, టెస్ట్ ఓట్లపై అవగాహన పెంచుకోవాలని, పోలింగ్ పూర్తయిన తర్వాత కంట్రోల్ యూనిట్ లో క్లోజ్ బటన్ పోలింగ్  ఏజెంట్ల ముందు చేసి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ లోని  సూచనల ప్రకారం అన్ని పత్రాలను సీల్ చేయాలని తెలిపారు. శిక్షణా కార్యక్రమాలలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి,  జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏ.భాస్కరరావు, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్,  అసెంబ్లీ స్థాయి ట్రైనర్స్ శిక్షణ,  అవగాహన కల్పించారు. ఈ 
కార్యక్రమంలో భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి, రిటర్నింగ్ అధికారి అమరేందర్,  జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి,  ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.