విశాఖ సిపి ని కలిసిన జాతీయ వికలాంగుల సంఘం ప్రతినిధులు...

విశాఖ సిపి ని కలిసిన జాతీయ వికలాంగుల సంఘం ప్రతినిధులు...
  • దేశంలోనే మొదటిసారిగా దివ్యాంగుల కోసం సిపి  వినూత్న ప్రక్రియ...
  • అభినందనలు తెలిపి సత్కరించిన జాతీయ వికలాంగుల నెట్వర్క్ బృందం..

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: భారత దేశంలోనే మొట్ట మొదటి సారిగా దివ్యాంగుల కోసం విశాఖ సిటీ  పోలీసులు వినూత్న ఆలోచనలతో  రూపొందించిన "దిశ - దివ్యాంగ్ సురక్షా" హెల్ప్ లైన్ సేవల విధానం గురించి విశాఖ నగర పోలీస్ కమిషనర్  డాక్టర్ ఏ.రవి శంకర్,  పలు వికలాంగ సంఘం ప్రతినిధులకు వివరించారు. ఈ మేరకు బుధవారం విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తనను కలిసిన జాతీయ వికలాంగుల నెట్వర్క్ మరియు పూర్ణమిధం సంఘం ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా సిపి  మాట్లాడుతూ భారత దేశంలోనే మొట్ట మొదటి సారిగా విశాఖ నగరంలో దివ్యాంగుల  కోసం ముఖ్యంగా బదిరులు, అంధుల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశామని,ఇందులో దివ్యాంగులకు అర్థం అయ్యేట్టుగా నిపుణులతో పాటు సైన్ విధానం ద్వారా దివ్యాంగులు చేసిన పిర్యాధుపై కంట్రోల్ రూం వెంటనే స్పందిస్తుందని తెలిపారు. ఇందుకు గాను ఒక ప్రత్యేక ప్రింటర్ ను ఏర్పాటు చేసి,అందులో ఇంగ్లీష్ లో టైప్ చేస్తే  అవతలి అంధులైన వారికి బ్రెయిలీ లిపి ద్వారా తీసుకున్న చర్యల గురించి వెంటనే వారికి అందిస్తామని తెలిపారు.

అందుకు గాను నగరంలో "దిశ దివ్యాంగ్  సురక్ష" హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి రెండు వాట్సాప్ నంబర్ల ద్వారా ప్రతి నెలలో రెండు సార్లు అంటే నెలలో రెండవ తేదీన తర్వాత 15వ తేదీన గంట పాటు "డయల్ యువర్ సి.పి కార్యక్రమంలో సి.పి.గారు,నిపుణులు స్వయంగా పాల్గొని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈవ్ టీజింగ్, ఇతర నేరాలపై కూడా ఫిర్యాదు చేస్తే సత్వరమే చర్యలు తీసుకుంటున్నామని, జాతీయ వికలాంగుల చట్టం 2016 మేరకు దివ్యాంగులు ఫిర్యాదు చేస్తే పలు చోట్ల సెక్షన్ 92 ప్రకారం వెంటనే ఎఫ్. ఐ.ఆర్. లు చేశామని తెలిపారు. ఈలాంటి విధానం దేశంలోనే మొట్ట మొదటి సారిగా విశాఖ నగర పోలీసులు అమలు చేస్తున్నారన్నారు.

ఈ సందర్భంగా జాతీయ వికలాంగుల నెట్ వర్క్ ప్రతినిధులు మరియు విశాఖకు చెందిన పూర్ణమిధం సంఘం ప్రతినిధులు తమ వికలాంగులు చేస్తున్న ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని, ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా దివ్యాంగులు నేరుగా ప్రవేశించి స్థానిక పొలీస్ అధికారులను కలిసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లతో పాటు,ర్యాంపు ల నిర్మాణం చేపట్టాలని, 2016 జాతీయ వికలాంగుల చట్టం ప్రకారం వికలాంగులకు చేయూత నిచ్చి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సి.పి స్వయంగా తయారు చేసుకున్న రెండు వీడియో లను వికలాంగ సంఘం ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కాగా భారత దేశంలోనే మొట్ట మొదటి సారిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఏ.రవి శంకర్, ఐ.పి.ఎస్. గారు దివ్యాంగుల కోసం చేస్తున్న కృషిని సంస్థల ప్రతినిధులు అభినందించి వారిని శాలువాతో సత్కరించి,జ్ఞాపికలను అందజేశారు.కాగా సిపి కూడా తమ సిటీ పోలీస్ శాఖ తరపున సంస్థ ప్రతినిధులకు జ్ఞాపికలు అందించారు.ఈ కార్యక్రమంలో  జాతీయ వికలాంగుల నెట్ వర్క్స్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఇంచార్జీ నల్గొండ శ్రీనివాసులు, సంస్థ ప్రతినిధి ఇనుముల సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ఇంచార్జీ జీలకర్ర రమణ, పూర్ణమిధం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కావ్య పూర్ణిమ, వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.సతీష్ తదితరులతో పాటు పలు వికలాంగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.