అంధకారంలో సాగర్ రేడియల్ రహదారి

అంధకారంలో సాగర్ రేడియల్ రహదారి
  • హైదరాబాద్‌-సాగర్‌ ప్రధాన రహదారిపై చిమ్మ చీకట్లు
  • రహదారి పొడవునా వెలగని హైమాస్ట్ వీది దీపాలు
  • తరచూ ప్రమాదాల భారిన ప్రయాణికులు
  • పట్టించుకోని అధికారులు.. నిర్వహణలో సమన్వయ లోపం

ఇబ్రహీంపట్నం, ముద్ర ప్రతినిధి: హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారిపై అంధకారం రాజ్యమేలుతోంది. సాగర్ రింగ్ రోడ్డు నుండి ఇబ్రహీంపట్నం వరకు విస్తరించి ఉన్న రెడియల్ రహదారిపై రాత్రయితే చాలు చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి. సాగర్‌ ప్రధాన రహదారిపై వీధి దీపాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో చీకటిలో ప్రయాణం చేసి ప్రయాణికులు ప్రమాదాల భారిన పడుతున్నారు. ప్రధాన రహదారిపై అంధకారంలో ప్రయాణంలో ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వీధి దీపాలు వెలగకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి సమయాల్లో ఈ రహదారి నుండి కుటుంబ సభ్యులతో ప్రయాణించాలంటే వాహన దారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నగరం నుండి నాగార్జున సాగర్ వరకు, దేవరకొండ, చింతపల్లి, మల్లేపల్లి, మాల్, యాచారం, ఇబ్రహీంపట్నం వైపు నిత్యం ఇదే రహదారి నుండి వేలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. రాత్రి సమయాల్లో ప్రయాణం నరకప్రాయంగా మారినా తమకేమి పట్టవనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. డివైడర్ పై దీపాలు వెలగకపోవడం, ఎక్కడికక్కడ సూచిక లేని బారికేడ్లను ఏర్పాటు చేయడం, వీది దీపాల స్తంభాలకు ఫ్లెక్సీలు కట్టడం కూడా ఒకింత ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 

ప్రమాదాలతో కొన్ని చోట్ల పని చేయని వీధి దీపాలు

సాగర్ రహదారిపై తరచూ చోటు చేసుకున్న ప్రమాదాలతో సైతం వీధి దీపాలు పనిచేయకుండా పోతున్నాయి. అక్కడక్కడ వాహనాలు హైమాస్ లైట్ స్తంభాలను, డివైడర్లను ఢీకొంటున్నాయి. దీంతో కొన్నిచోట్ల వీధి దీపాలు పనిచేయడం లేదు. దీనిని సరి చేయడానికి సంబంధిత అధికారులు నెలలు తరబడి సమయాన్ని తీసుకుంటున్నారు. దీంతో నిశీధిలో ప్రయాణం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఇక చౌరస్తాలు ప్రధాన కూడళ్ళు గ్రామాల కూడళ్లలో సెంట్రల్ లైటింగ్ వెలుగకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి. చర్యలు చేపట్టాల్సిన అధికారులు మిన్నకుంటున్నారు. 

నిశీధిలో ప్రధాన కూడళ్లు

సాగర్ రింగ్ రోడ్డు నుండి విస్తరించి ఉన్న హైదరాబాద్ సాగర్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ప్రధాన కోడళ్ళు గ్రామాలు రాత్రి అయితే చీకటిలో మగ్గుతున్నాయి. హైమాస్ట్ లైట్లు సెంట్రల్ లైటింగ్ సిస్టం అలంకారప్రాయంగా మారడంతో గుర్రంగూడ, ఇంజాపూర్, తుర్కయంజాల్ రాగన్నగూడ, మన్నెగూడ, మంగళపల్లి, శేరిగూడ, ఇబ్రహీంపట్నం ప్రధాన కూడళ్ళలో చీకట్లు అలుముకుంటున్నాయి. మంగళపల్లి సమీపంలోని శ్రీఇందు కళాశాల సమీపంలో బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతుండగా అక్కడ రాత్రి సమయంలో ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ కనీసం సూచిక బోర్డులు లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలకు కారణం అవుతోంది. మున్సిపాలిటీల పరిధిలో వీధిదీపాల నిర్వహణకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్న సదరు ఈఈఎస్‌ఎల్‌ సంస్థ నిర్వహణ సక్రమంగా చేపట్టడం లేదు. 

నిర్వహణలో సమన్వయ లోపం

సాగర్‌ ప్రధాన రహదారిపై వీధి దీపాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి ఇప్పటికైనా అధికారులు వీధి దీపాల నిర్వహణపై దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. నిర్వహణలో సంబంధిత శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్‌అండ్‌ బీ, మున్సిపల్‌, పోలీస్‌ శాఖలు, మున్సిపాలిటీ పరిధిలోని వీధి దీపాల నిర్వహణ బాధ్యత ఉన్న ఈఈఎస్‌ఎల్‌ కంపెనీ సిబ్బంది దృష్టి సారించి వీధి దీపాలు వెలిగేలా చూడాలని, ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు, ప్రయాణికులు కోరుకుంటున్నారు.