భక్తికి, సేవకు, ఆత్మీయతకు, ఐక్యతకు మారుపేరే సిద్దిపేట

భక్తికి, సేవకు, ఆత్మీయతకు, ఐక్యతకు మారుపేరే సిద్దిపేట

కేదార్ నాథ్ లో యాత్రికులకు ఆహార పదార్థాలు అందించే లారీ పూజకు హాజరైన మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట : ముద్ర ప్రతినిధి: అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు. మానవ సేవయే మాధవ సేవ. శివ భక్తులకు సేవ చేస్తే ఆ పరమ శివునికి సేవ చేసినట్లేనని రాష్ట్ర ఆర్థిక, వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలోని శరభేశ్వరాలయంలో ఆదివారం కేదార్ నాథ్ అన్నదాన సేవ సమితి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేదార్ నాథ్ యాత్రికులకు సోన్ ప్రయాగ్ వద్ద ఉచితంగా తెలుగు వారికి భోజనం అందించే ఏకైక లంగర్ కువెళ్లే ఆహార పదార్థాలను తీసుకెళ్తున్న లారీకి మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. మూడవ సారి తెలుగు వారికి భోజనం అందించేందుకు పంపుతున్న ఆహార పదార్థాల లారీని జెండా ఊపి సాగనంపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రక్తం గడ్డ కట్టే మంచులో కొండల్లో శివ భక్తులకు అన్నదానం చేసేందుకు దక్షిణ భారతదేశంలో మొదటి లంగర్ సిద్ధిపేట ఉండటం సంతోషకరమైన విషయమని తెలిపారు.

అన్నింటా సిద్ధిపేట ఆదర్శంగా నిలిచిందని, ఆరోగ్య సిద్ధిపేటలో భాగంగా మితమైన ఆహారం తీసుకుంటే అమితమైన ఆరోగ్యం పొందవచ్చునని మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని హితవుపలికారు. నిత్యం యోగ, ప్రాణాయామం చేయాలని కోరారు. మీరు యోగ చేస్తానంటే అవసరమైతే ప్రత్యేక శిక్షకులను ఏర్పాటు చేస్తానని చెప్పారు. అమర్ నాథ్, కేదార్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరిస్తూ.. ఆ సమితి ప్రతినిధులను కొనియాడారు. కేదార్ నాథ్ అన్నదాన సేవా సమితికి తనవంతు సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పట్టణ పారుపల్లి వీధిలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయ వార్షికోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయనిర్వాకులు మంత్రికి ఆశీర్వచనం అందజేశారు.