గల్ఫ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం

గల్ఫ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం
  • ప్రభుత్వ భూములు అమ్ముతున్నా పరిష్కారం కాని గల్ఫ్‌ సమస్యలు
  • టీపీసీసీ ఎన్నారై సెల్‌ స్టేట్‌ కన్వీనర్‌ షేక్‌ చాంద్‌ పాషా డిమాండ్‌

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : గల్ఫ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం అయ్యిందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఎన్నారై సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ షేక్‌ చాంద్‌ పాషా అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయం నుంచి అధికారంలోకి వచ్చే దాకా గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం, అభివృద్ది కోసం పాటుపడతామని చెప్పి, అధికారంలోకి వచ్చాక హామీలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కడం దురదృష్టకరం అన్నారు. గల్ఫ్‌ ఏజెంట్ల మోసాలకు సామాన్య ప్రజలు బలి అవుతున్నా, అవేవి పట్టనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం విచారకరం అన్నారు. ఉద్యమ సమయం నుంచి నివేదికల రూపంలో గల్ఫ్‌ ఏజెంట్ల మోసాలపై ప్రభుత్వ పెద్దలకు వివరించిన ఫలితం శూన్యం అన్నారు. ప్రస్తుతం ఏజెంట్ల మోసాలు ఇంకా పెరిగిపోయాయి తప్ప వారిపై చర్యలు లేవన్నారు. గల్ఫ్‌లో మరణించిన ప్రతి కుటుంబానికి భేషరతుగా రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించి, ఆదుకోవాలని, అర్హత ఆధారంగా కుటుంబంలోని ఓ వ్యక్తికి ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు.  ఏజెంట్ల మోసాలు అరికడుతూ, పోలీసులకు పగడ్భందీగా ఆదేశాలు ఇవ్వాలని, బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైన ఏజెంట్లపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసి అరెస్టు చేయాలని, ప్రతి జిల్లాలో ఎన్నారై హై కమీషన్‌ ను నియమించి ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు, ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలనీ అన్నారు.  జాతీయ మానవ హక్కుల కమీషన్‌ 2016లో తెలంగాణ నుంచి మహిళలు గల్ఫ్‌ దేశాలకు అక్రమంగా వెళ్తున్నారని ఫిర్యాదు చేయగా, కేంద్రానికి, రాష్ట్రనికి ఎనిమిద వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన, తొమ్మిదేళ్లు గడిచిన ఎందుకు  సమాధానం ఇవ్వడం లేదో జగిత్యాలకు వస్తున్న మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్‌లు నెరవేర్చలేని పక్షంలో రానున్న ఎన్నికల్లో  బిఆర్ ఎస్  ప్రభుత్వానికి ప్రజలు సరైన సమాధానం చెప్తారని అన్నారు.