శిశువు కిడ్నాప్ కథ సుఖాంతం

శిశువు కిడ్నాప్ కథ సుఖాంతం
  • 24 గంటల్లో కేసు ట్రేస్ అవుట్ 
  • క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు
  • శభాష్ కరీంనగర్ పోలీస్ అంటూ  ప్రశంసలు 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :- కరీంనగర్ మాతా శిశు హాస్పటల్లో కిడ్నాపైన మూడు రోజుల పాప కథ సుఖాంతం అయింది. పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల్లోనే కేసును ట్రేస్ అవుట్ చేశారు. పసిపాపను తల్లి ఒడికి చేర్చారు. పోలీసులు కేసును చేదించిన విధానానికి శభాష్ కరీంనగర్ పోలీస్ అంటూ ప్రజలు ప్రశంసిస్తున్నారు. కరీంనగర్ టౌన్ ఏసిపి గోపతి నరేందర్ మీడియాతో మాట్లాడుతూ జీవనోపాధి నిమిత్తం బీహార్ కు చెందిన నిర్మల, మనోజ్ రామ్ అను దంపతులు   కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. డెలివరీ నిమిత్తం నిర్మల 16వ తేదీ   రోజున అడ్మిట్ అయింది.

అదే రోజు పండంటి పాపకు జన్మనిచ్చింది. గుర్తు తెలియని మహిళ పాపకు వ్యాక్సిన్ వేయాలంటూ తీసుకువెళ్లారు. ఎంతకు పాపను తీసుకుని తిరిగి రాకపోవడంతో హాస్పిటల్ సిబ్బందికి సమాచారం అందించింది. కరీంనగర్ టూ టౌన్   పోలీసులకు వెంటనే సమాచారం అందించడంతో తల్లిదండ్రుల నుండి పిటిషన్ స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ టౌన్ ఏసిపి గోపతి నరేందర్  కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని  మూడు పోలీస్  బృందాలను ఏర్పాటు చేశారు. సిసి ఫుటేజ్ ల సమాచారం సేకరిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో పెద్దపల్లి జిల్లా తంగళ్ళపల్లి లో కిడ్నాప్ చేసిన మహిళను పట్టుకున్నారు. తనకు పిల్లలు లేరని గమనించిన జమ్మికుంటకు చెందిన ఎర్రమ రాజు జగ్గం రాజు వృత్తిరీత్యా డాక్టర్ సలహా మేరకు ఈ ఘాతకానికి పాల్పడినట్లు ఏసిపి తెలిపారు. కిడ్నాప్ అయిన పాపను తల్లిదండ్రుల దగ్గరకు క్షేమంగా చేర్పించినట్లు వెల్లడించారు. 24 గంటల్లోనే  కేసును చేదించిన కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్  ఓ వెంకటేష్, జమ్మికుంట టౌన్ సీఐ  వి రవి, టాస్క్ ఫోర్స్  సిఐ కిరణ్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ పోలీసులను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు.